తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే పలువురు దిగ్గజ నటులను పోగొట్టుకున్న టాలీవుడ్.. మరో మకుటాన్ని కూడా కోల్పోయింది. సీనియర్ హీరోయిన్ జమున ఇక లేరు. వయో భారం తో పాటు గుండెపోటు రావడం తో ఆమె శుక్రవారం హైదరాబాద్ లో మరణించారు. ఆమెకు 86 ఏళ్ళు. తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో సుమారు 198 చిత్రాల్లో జమున నటించారు. జమున తెలుగు సినిమాల్లో వగరు, పొగరు, భక్తి, ఇలా నవరసారాలు పలకించగలిగే అరుదైన నటిగా పేరు సంపాదించుకున్నారు.
గరికపాటి రాజారావు తీసిన ‘పుట్టిల్లు’ సినిమాతో జమున చిత్రసీమకు పరిచయం అయ్యారు. అయితే, ఎల్వీ ప్రసాద్ తీసిన ‘మిస్సమ్మ’తో ఆమెకు ఫస్ట్ బ్రేక్ వచ్చింది. తొలి సినిమా చేసినప్పుడు ఆమె వయసు 15 ఏళ్ళు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు ఇలా స్టార్ హీరోలందరి సరసన ఆమె నటించారు. ఎన్ని హిట్ సినిమాల్లో నటించినా ఆమెకు సిల్వర్ స్క్రీన్ సత్యభామగా ఎక్కువ పేరు వచ్చింది. అందుకు కారణం ‘శ్రీకృష్ణ తులాభారం’. ఆ సినిమాలో ఆమె నటనను ఎవరూ అంత త్వరగా మరువలేరు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం నటిగా జమున ప్రత్యేకత. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా ఆమె అదరగొట్టేవారు.
అయితే ఆమె సినీ ప్రస్థానం లో ఒక దశలో ఆమెకి ఎన్టీఆర్, ఏయన్నార్ తో విభేధాలు వచ్చాయి .. జమునకు వారి సరసన అవకాశాలు దూరం చేశాయి. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత చక్రపాణి జోక్యంతో ఈ విభేదాలకు తెరపడింది. సినీ రంగంలో ఉంటూనే సేవ, రాజకీయ రంగాల్లోనూ జమున విశేషంగా కృషి చేసింది. ఏటా తన పుట్టినరోజున పేద కళాకారులకు ఆర్థిక సాయం చేస్తుంది. ఆమె చనిపోయే వరకు ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించారు. 1980లో ఇందిరా గాంధీ ప్రేరణతో కాంగ్రెస్ పార్టీలో చేరింది. 1989లో రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచారు.
తెలుగు సహా తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో జమున నటించారు. హిందీలో సుమారు 10 సినిమాలు చేశారు. కన్నడలో 8, తమిళంలో సుమారు 30 సినిమాలు చేశారు. తెలుగులోనే జమున ఎక్కువ సినిమాలు చేశారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. 2008లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ వచ్చింది. సినీ పరిశ్రమలోనే కాక రాజకీయాల్లోనూ ఆమె చేసిన సేవలు మరువలేనివి.
జమున అచ్చమైన తెలుగింటి కోడలు. ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జూలూరి రమణారావును ఆమెను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె హైదరాబాద్ వచ్చేసారు. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తొలి తరం నటి ఈమెనే కావడం విశేషం. అప్పట్లో చైన్నైలో తన ఆస్తులను ఎంతో తక్కువ విలువకు అమ్మి ఆమె ఇక్కడికి వచ్చారని తెలుస్తోంది. జమున దంపతులకు ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు వంశీ జూలూరి. అమ్మాయి పేరు స్రవంతి.