తెలుగులో మోస్ట్ సక్సెస్ఫుల్ రియాలిటీ షోస్‌లలో బిగ్‌బాస్ ఒకటిగా నిలిచింది. ఐదు సీజన్స్‌తో పాటు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బిగ్‌బాస్ అంతులేని వినోదాన్ని పంచింది. ఇటీవలే బిగ్‌బాస్ ఆరవ సీజన్ మొదలైంది. మూడో సీజన్ నుంచి బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున నే ఆరవ సీజన్ హోస్ట్ గా మారారు.
తొలిరోజు నుంచే కంటెస్టెంట్స్ ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయిస్తూ ఆటలో దూసుకుపోతున్నారు. కాగా బిగ్‌బాస్ ఫస్ట్ ఎపిసోడ్‌కు ఊహించని రీతిలో లోయెస్ట్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఓపెనింగ్ డే ఎపిసోడ్ లో రణబీర్ కపూర్, అలియా భట్ గెస్ట్ లుగా వచ్చి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశారు. అయినా కేవలం 8.86 టీఆర్పీ రేటింగ్ మాత్రమే సాధించింది. ఆరు సీజన్స్‌లో ఫస్ట్ ఎపిసోడ్‌కు వచ్చిన లోయెస్ట్ టీఆర్పీ రేటింగ్ ఇదే కావడం గమనార్హం.
నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన నాలుగోసీజన్ ఫస్ట్ ఎపిసోడ్ హయ్యెస్ట్‌గా 18.5 టీఆర్పీ రేటింగ్స్‌తో టాప్ ప్లేస్‌లో నిలవగా బిగ్‌బాస్ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ 17.9 టీఆర్ప్ రేటింగ్ దక్కించుకున్నది. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్‌బాస్ సీజన్ వన్ ఫస్ట్ ఎపిసోడ్ 16.8 టీఆర్పీ రేటింగ్ సాధించింది. అందులో సగం మాత్రమే సీజన్ 6 ఫస్ట్ ఎపిసోడ్ కు రావడం షాక్‌కు గురిచేస్తోంది.
ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారమైన రోజున ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ ఉండటం వల్ల కూడా రేటింగ్ తగ్గిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. వీక్ డేస్ లో బిగ్ బాస్ షో రాత్రి 10 గంటలకు ప్రసారం కావడం కూడా ఈ షో రేటింగ్ పై ప్రభావం చూపిస్తూ ఉండవచ్చని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. రేటింగ్స్ తగ్గిన నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు ఏం చేస్తారో చూడాల్సి ఉంది.
ఓటీటీల హవా అంతకంతకూ పెరుగుతుండటం రేటింగ్స్ పై కూడా ప్రభావం చూపుతోంది. ప్రముఖ ఛానెళ్లకు సొంతంగా ఓటీటీలు ఉండటం ఆ ఓటీటీలలో ఎప్పుడైనా రియాలిటీ షోలను చూసే అవకాశం ఉండటంతో చాలామంది టీవీలలో బిగ్ బాస్ షోను చూడటానికి ఆసక్తి చూపించలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓటీటీల వల్ల టీవీ ఛానెళ్లకు కూడా భారీగానే నష్టం కలుగుతోందని చెప్పాలి.