నేను ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని. మా ఇంట్లో నేనొక్కదాన్నే ఆడపిల్లని కావడం తో నన్ను గారాబం గా పెంచారు. పెళ్లి వయసు వచ్చాక అందరిలాగే నాకు కూడా నా తల్లితండ్రులు పెళ్లి చేసి పంపేయాలనుకున్నారు.
కానీ, కొడుకులు లేని నా తల్లి తండ్రులకి నేనే ఆధారం అవ్వాలనుకున్నాను. నాకు నచ్చిన ఉద్యోగం చేసి మా నాన్నకి సపోర్ట్ గా నిలిచాను. నన్ను నేను చూసుకున్నప్పుడల్లా గర్వం గానే ఫీల్ అవుతుంటాను.
కానీ, ఈ సమాజం మాత్రం అందరిలా నన్ను మార్చేయాలని చూస్తూ ఉంటుంది. అందరిలా పెళ్లి చేసుకుని, అందరిలా పిల్లల్ని కనేసి.. ఆ తరువాత ఏమి ఉద్దరించాలో ఈ సమాజానికేమి తెలుసు..? ఆఫీస్ కు వెళ్లి ఇంటికి వచ్చేలోపు ప్రతి వాడి చూపులు మెడలో మంగళ సూత్రాలున్నాయా.. కాలికి మెట్టెలున్నాయా అని వెతుకుతుంటాయి. అవి కనపడకపోతే వాళ్ళ కళ్ళకి కామపు మబ్బులు కమ్ముతాయి. ఎప్పటిలా ఇవే ఆలోచనలతో ఆఫీస్ కు బయలుదేరిన నాకు వర్షం అడ్డొచ్చింది.
రోడ్డు దాటి బస్టాప్ షెల్టర్ కి చేరేసరికి వర్షం లో తడిసిపోయాను. నా బట్టలు కూడా తడిసిపోవడం తో, అక్కడ చాలా మంది అబ్బాయిలు కామం తో కళ్ళు మూసుకుపోయి గుడ్లప్పగించి తదేకం గా చూస్తున్నారు. నాకు వెంటనే జ్ఞానోదయం అయి స్కార్ఫ్ తీసి కప్పుకున్నాను. ఇలాంటి వారి కళ్ళ నుంచి తప్పుకోవడానికి ఆడవాళ్లు ఎన్ని పాట్లు పడతారో ఆ బ్రహ్మ కే ఎరుక. మృగాళ్లు తమ బుద్ధులు పోనిచ్చుకోనంతకాలం ఆడవాళ్ళ బట్టలు ఎలా వేసుకున్నా ఇక్కట్లు తప్పవు అని మనసులో అనుకుంటూ బస్సు కోసం వెయిట్ చేసాను.
ఈరోజు లేచిన వేళా విశేషమేమిటో గాని, అన్ని పనులు ఆలస్యమవుతూనే ఉన్నాయి. విసుగ్గానే ఆఫీస్ కు చేరుకున్నాను. నేను వెళ్ళేసరికే అక్కడ అంతా గందరగోళం నెలకొని ఉంది. మా ఆఫీస్ లో చిన్న ఫైర్ ఆక్సిడెంట్ జరిగింది. ఆఫీస్ లోని కంప్యూటర్ ప్లగ్ ఇన్స్ పెట్టె బోర్డు దగ్గర షార్ట్ సర్క్యూట్ జరగడం తో మంటలు అలుముకున్నాయి.. ఓ గది మొత్తం ఆ మంటలు వ్యాపించాయి. నేను ఆఫీస్ దగ్గరకి వెళ్లేసరికి నా ఫ్రెండ్ ని హడావిడిగా అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్నారు.
మంటలు వ్యాపించిన గదిలోనే ఆమెకూడా ఉండడం తో, ఆమె శరీరానికి కూడా మంటలు అంటుకున్నాయి. ఆమె తో పాటు నేనూ ఆసుపత్రికి వెళ్ళాను. కాలిన గాయాలతో ఆమె విలవిలలాడుతుంటే.. మనసు చివుక్కుమంది. ఒక్క క్షణం నాకు అప్పటివరకు జరిగిందంతా గుర్తుకు వచ్చింది. ఇంటి దగ్గర బయలుదేరి ఆఫీస్ కి వచ్చేవరకు నా పరిస్థితి కూడా అలానే ఉంది. నా మనస్సు కూడా దహించిపోతున్న బాధను అనుభవించింది. నా ఫ్రెండ్ శరీరానికి మంటలవలన గాయాలయితే, నా మనసుకి కామపు చూపుల్తో మంట అంటుకుంది. అంతే తేడా..!