కరోనా టెస్ట్ చేస్తారనే భయంతో చెకింగ్ నుండి తప్పించుకోవాలని చేసిన ఈ ప్రయత్నం ప్రాణాల మీదకు తెచ్చింది. నాగ సింధు రెడ్డి, శివ శంకర్ కి ఏడాది కిందట పెళ్లయింది. ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు గా పని చేస్తున్నారు. సింధు ఇప్పుడు గర్భవతి. బెంగళూరు నుండి హైదరాబాద్ కి తన అత్తగారింటికి కారులో భర్త శివశంకర్ తో పాటు బయల్దేరారు సింధు.
దూర ప్రయాణం కావడంతో శివశంకర్ స్నేహితుడైన జిలానీ బాషా కూడా వాళ్లతో హైదరాబాద్ కి బయల్దేరారు. కర్నూలు దాటిన తర్వాత వచ్చే పుల్లూరు చెక్‌పోస్టు దగ్గర మెడికల్ చెకింగ్ చేస్తారేమో, క్వారంటైన్ లో ఉండాలని సూచిస్తారు ఏమో అనే భయంతో జాతీయ రహదారి పై నుండి కాకుండా మధ్యలో వచ్చే గ్రామాల మీద నుండి వెళ్దామని కారుని మళ్ళించారు జిలానీ.
ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల లో భారీ వర్షం కురవడంతో రోడ్ల పై వరద నీరు పారుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం పరిధిలోని ఉండవెల్లి మండలం కలుగొట్ల గ్రామం దగ్గర ఉండంగా వరద నీరు ఉధృతంగా ఎక్కువయ్యి కారు పల్టీ కొట్టి వాగులోకి దూసుకెళ్లింది. సింధు ఆ సమయంలో నిద్రలో ఉండటంతో ఏం జరుగుతోందో తనకి అర్థం కాలేదు.
ఆ ప్రమాదంలో సింధు వరదనీటిలో మునిగారు. శివశంకర్ ఎంతో కష్టపడి కార్ డోర్ తెరిచి సింధుని నీటిలో నుండి బయటికి లాగడానికి ప్రయత్నించారు. వరద నీరు చాలా వేగంగా ప్రవహిస్తూ ఉండటంతో శివశంకర్ చేయిని అందుకోలేకపోయారు సింధు. దాంతో పట్టుతప్పి సింధు వాగు లో కొట్టుకుపోయారు.
శివ శంకర్ రెడ్డి, జిలానీ గాయాలతో ఒడ్డుకు చేరారు. సింధు ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు. ఆ వాగు కి ఐదు వందల మీటర్ల దూరంలో తుంగభద్ర నది ఉంది. బహుశా సింధు నదిలో కి చేరి ఉండొచ్చు అన్న అనుమానాలను రెస్క్యూ సిబ్బంది వ్యక్తం చేశారు. సింధూ కుటుంబం తను ఎలా ఉందో, క్షేమంగా ఉందో లేదో అని ఆందోళన చెందుతున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో తుంగభద్రా నది లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సిపిఐ వెంకట్రామయ్య చెప్పారు.