కరోనా వైరస్ సంక్షోబాన్ని ఎదుర్కోవడానకి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO కొత్త నియమ నిబంధనల్ని అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. ఈ నిబంధనల వలన మనకు కలిగే లాభమేంటో తెలుసా?
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా పీఎఫ్ బ్యాలెన్స్ నుంచి ఉద్యోగులు 75% లేదా మూడు నెలల బేసిక్ వేతనంలో ఏది తక్కువ అయితే అది పాండమిక్ అడ్వాన్స్ రూపంలో విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తూ నిబంధనల్ని మార్చింది ఈపీఎఫ్ఓ. దీంతో పాటు 100 లోపు ఉద్యోగులు ఉన్న సంస్థల్లో రూ.15,000 లోపు వేతనం ఉన్న ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లకు ఎంప్లాయర్ షేర్ 12 శాతం, ఎంప్లాయీ షేర్ 12 శాతం ఆరు నెలల పాటు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.
ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ప్యాకేజీలో భాగంగా 12 శాతం చొప్పున ఉన్న ఎంప్లాయర్, ఎంప్లాయీ షేర్‌ను 10 శాతానికి తగ్గించింది.ఈపీఎఫ్ అకౌంట్లో ఎంప్లాయర్, ఎంప్లాయీ షేర్‌ను 10 శాతానికి తగ్గించడంతో ఆ మేరకు నిబంధనల్ని మారుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ. ఇది మూడు నెలలకే వర్తిస్తుంది.అంటే మే, జూన్, జూలై నెలలకు ఈపీఎఫ్ ఖాతాలో మొత్తం 24 శాతం కాకుండా కేవలం 20 శాతం చొప్పున జమ అవుతుంది. దీని వల్ల సంఘటిత రంగంలో పనిచేస్తున్న 4.3 కోట్ల మంది ఉద్యోగులకు మే, జూన్, జూలై నెలల టేక్ హోమ్ సాలరీ పెరుగుతుంది. ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గుతుంది.
ఈ నిబంధనపై ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లకు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగులు కావాలంటే తమ వాటాను 10 శాతం నుంచి పెంచుకోవచ్చని స్పష్టం చేసింది. కానీ యజమానులు మాత్రం 10 శాతం జమ చేస్తే చాలని తెలిపింది. ఈపీఎఫ్ స్కీమ్-1952 ప్రకారం ఉద్యోగులు 10 శాతం లేదా అంతకన్నా ఎక్కువ తమ ఈపీఎఫ్ అకౌంట్లో జమ చేయొచ్చని, యజమాని మాత్రం 10 శాతం జమ చేయాలని వివరించింది. కాబట్టి ఉద్యోగులు కోరుకుంటే గతంలోలాగే 12 శాతం చొప్పున ఈపీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ చేసుకోవచ్చు.
ఈ కొత్త నిబంధన రూ.15,000 కన్నా ఎక్కువ వేతనం పొందుతున్న ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. రూ.15,000 లోపు వేతనం పొందుతూ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నవారికి వర్తించదు. ఎందుకంటే వారికి కేంద్ర ప్రభుత్వమే 24 శాతం ఈపీఎఫ్ అకౌంట్లో జమ చేస్తుంది కాబట్టి వారికి ఈ రూల్ వర్తించదు
ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మరో మూడు నెలల్లో రూ.6,750 కోట్ల నగదు లభ్యత ఏర్పడుతుందని అంచనా. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 12 శాతం ఈపీఎఫ్ఓ అకౌంట్లో ఎప్పట్లాగే జమ అవుతుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ విషయంలో తీసుకున్న నిర్ణయంతో నెలసరి 15 వేల రూపాయల లోపు జీతం పొందే ఉద్యోగులకు భారీగా లబ్ది చేకూరనుంది.నెలసరి ఉద్యోగి వాటాగా తన వేతనం నుంచి కట్ అయ్యే 12% PF అమౌంట్ ను మూడు నెలల పాటు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అంటే మూడు నెలలకు లెక్కేసుకుంటే అది ఆ ఉద్యోగి వేతనంలో 36 శాతం అవుతుంది.అలాగే 15 వేల రూపాయలకు పైగా వేతనం పొందే ఉద్యోగుల PF కాంట్రిబ్యూటరీ మొత్తాన్ని 12 నుంచి పది శాతానికి తగ్గించి…వారి చేతికి అందే వేతన మొత్తం రెండు శాతం పెరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.మర్చిపోవద్దు ఈ ఆర్థిక భరోసా కేవలం మూడు నెలల కోసమే ఉద్దేశించారు.