నేచురల్ స్టార్ నాని, ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కింది. మార్చి 30న పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజే రూ. 38 కోట్లు వసూలు చేసి నాని కెరీర్లోనే డే 1 హైయెస్ట్ గ్రాసర్ గా ఈ మూవీ నిలిచింది.
Video Advertisement
అయితే తాజాగా దసరా మూవీ ఒక వివాదంలో చిక్కుకుంది. తమను కించపరిచేలా ఈ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంగన్‌వాడిలు ఆందోళనకు దిగారు. సమాజానికి ఎంతో సేవ చేస్తోన్న అంగన్‌వాడి టీచర్లను దసరా మూవీలో దొంగలుగా చిత్రీకరించారని అంగన్‌వాడి టీచర్లు ఆవేదన వ్యక్తంచేశారు.. వెంటనే ఆ సీన్లను తొలగించడంతో పాటు సినిమా బృందం తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
దసరా మూవీ లో కీర్తి సురేష్ ఈ చిత్రంలో వెన్నెల అనే క్యారెక్టర్ చేసింది. ఆమె ఒక అంగన్ వాడీ కార్యకర్త. ఒకానొక సమయంలో తను పిల్లల కోసం ఇవ్వాల్సిన కోడిగుడ్లను అమ్ముకుంటుంది. అంతేకాదు, మరికొన్ని గుడ్లను తీసుకెళ్లి తమ కుటుంబ సభ్యులకు ఇస్తుంది. దీంతో ఈ విషయం పై వివాదం మొదలైంది. దసరా’ సినిమాలోని ఆ సీన్లను తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వారు తేల్చి చెప్పారు.
ఇక ఇటీవలి కాలంలో సినిమాలు ఎంత పాపులర్ అవుతున్నాయో సినిమాల చుట్టూ నెలకొన్న వివాదాలు అంతే పాపులర్ అవుతున్నాయి. సినిమాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు తమను కించపరిచేలా ఉన్నాయంటూ నిరసనలు తెలపడం మనం చూస్తున్నాం. ఇక ఇప్పటి వరకు ఈ వివాదం పై యూనిట్ ఇంతవరకు స్పందించలేదు. ఇక ఈ మూవీ విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్క్ క్రాస్ చేసి, ప్రస్తుతం రూ.100 కోట్ల వైపుగా దూసుకెళ్తోంది.