వర్షపు నీళ్లు నేలపై పడిన తర్వాత మట్టి తడిసి ఒక రకమైన వాసన వస్తుంది. ఆ వాసన ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. కానీ మనలో చాలా మందికి అలా వర్షం పడిన తర్వాత వచ్చే వాసన ఇష్టం ఉంటుంది. చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది ఆ వాసన. మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? సాధారణంగా నీటికి వాసన ఉండదు. కానీ నీరు నేలపై పడగానే వాసన వస్తుంది.

అలా వర్షపు నీరు నేలపై పడగానే వాసన రావడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే. వర్షపు నీరు నేలపై పడి దుమ్ముతో కలిసి వచ్చే వాసనని పెట్రిచోర్ అంటారు. ఇది వర్షం పడిన తర్వాత వచ్చే వాసనని చెప్పడానికి వాడే సైంటిఫిక్ పేరు.

ఈ పదాన్ని గ్రీక్ పదాలు పెట్రా, ఇచోర్ నుంచి తీసుకున్నారు. పెట్రా అంటే స్టోన్ (రాయి) అని, ఇంకా ఇచోర్ అంటే గ్రీక్ పురాణాలలో దేవతల వెయిన్స్ (సిరలు) లో ప్రవహించే ఫ్లూయిడ్ అని అర్థం. 1964 లో ఇద్దరు ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ లు ఈ వాసనపై రాసిన ఆర్టికల్ పబ్లిష్ అయ్యింది. అందులో వాసన గురించి ఎక్స్పైనేషన్ ఇచ్చారు.

ఆ శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం మొక్కల్లో సహజమైన నూనె ఉంటుంది. ఆ నూనె ఆ మొక్క చుట్టుపక్కల ఉన్న భూమిలో కలుస్తుంది. తర్వాత వర్షం పడేంత వరకు అవి నిల్వ అయ్యి ఉంటాయి. వర్షం నీరు దుమ్ముతో కలిసినప్పుడు ఈ నూనె వాతావరణంలోకి విడుదలవుతుంది. ఆ సమయంలోనే మట్టిలో ఉండే జియోస్మిన్ అనే కెమికల్ కాంపౌండ్ కూడా వర్షం నీరు పడటం ద్వారా బయటకు వస్తుంది.

కొంత మంది శాస్త్రవేత్తలు ఈ వాసన యాక్టినోమైసెట్స్ అనే బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది అని అన్నారు. ఈ బ్యాక్టీరియా రిప్రొడక్షన్ కోసం ఉత్పత్తి చేసిన స్పోర్స్ వర్షం వచ్చినప్పుడు, వాన నీటిలో కలిసి ఈ వాసన వస్తుంది అని పేర్కొన్నారు. ఈ వాసన గురించి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) పరిశోధకులు 2015 లో వివరించారు.

వారు చెప్పిన దాని ప్రకారం వర్షపు చుక్కలు భూమిని లేదా ఇతర పోరస్ పదార్థాలను తాకినపుడు నీరు, చిన్న చిన్న గాలి బుడగలు క్రియేట్ చేస్తుంది. ఈ గాలి బుడగలు అన్నీ కలిసి నీటి చుక్క మీదకు వెళ్తాయి అప్పుడు ఆ నీటి చుక్క పేలి లోపల ఉన్న కాంపోనెంట్స్ వాతావరణం (అట్మాస్పియర్) లో స్ప్రే అవుతాయి. ఇవన్నీ ఏరోసోల్స్ ద్వారా తయారవుతాయి. ఈ ఏరోసోల్స్ గాలిలోకి విడుదలవుతున్నప్పుడు పెట్రిచోర్ వాసనని క్యారీ చేస్తాయి.

ఏరోసోల్స్ వ్యాపించడానికి వర్షపాతం యొక్క స్ట్రెంత్, వెలాసిటీ కూడా ఒక కారణం. ఒక నీటి బిందువు నుండి ఒక సెకండ్ లోపు వందల ఏరోసోల్స్ డిస్పర్స్ అవ్వగలుగుతాయి. వర్షపాతం ఎంత భారీగా ఉంటే గాలిలోకి విడుదలయ్యే ఏరోసోల్స్ సంఖ్య అంత తక్కువగా ఉంటుంది. వర్షం తక్కువగా లేదా మీడియం గా ఉన్నప్పుడు చుట్టుపక్కల పెట్రిచోర్ వాసన అంత స్ట్రాంగ్ గా ఉంటుంది.