Ads
ఆరోజు ఉగాది .ఆమె గుడికి వెళదామనుకుంది. తండ్రికి చెప్పి బయలుదేరింది. ఏమైందో మరి.. కాసేపటికే చిటపటలాడుతూ ఇంటికొచ్చేసింది. ఇంకెప్పుడూ గుడికి వెళ్లను నాన్నా అంటూ చెప్పేసింది. ఏమి జరిగిందమ్మా అంటూ ఆ తండ్రి అనునయం గా అడిగేసరికి తన కోపానికి కారణం చెప్పుకొచ్చింది.
Video Advertisement
గుడిలో ఒక్కరికి కూడా దేవుడిపై ధ్యాస లేదు నాన్నా.. ఎవరికీ వారు మొబైల్ ఫోన్స్ తో సమయం గడుపుతున్నారు. కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు.. కొందరేమో ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. ఇవి కాక ఇంకొందరు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎవ్వరికీ భక్తి లేదు. కనీసం భజనలు కూడా భక్తిపూర్వకం గా లేవు అంటూ మండిపడింది. ఆ తండ్రికి విషయం అర్ధమైంది.
గుడికి వెళ్లడం మానేసేముందు.. తాను చెప్పిన ఒక్క పనిని చేయాలంటూ కోరాడు. ఒక గాజు గ్లాసుని తనతో పాటు గుడికి తీసుకెళ్లమని చెప్పాడు. ఆ గ్లాస్ నిండా నీటిని పట్టుకుని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయమని చెప్పాడు. అయితే ఒక షరతు విధించాడు. ఆ గ్లాస్ నుంచి ఒక్క చుక్క నీటిబొట్టు కూడా నేల మీద పడకుండా ప్రదక్షిణ చేయాలనీ చెప్పాడు. ఆ అమ్మాయి సరే అని.. అలానే గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి.. ఇంటికి వచ్చింది.
చుక్క నీరు కూడా కింద పడకుండా ప్రదక్షిణలు చేసానని తండ్రికి చెప్పింది. ఇప్పుడు ఆ తండ్రి ఆ అమ్మాయిని మూడు ప్రశ్నలు అడిగాడు. ఎంతమంది గుడిలో మొబైల్ ఫోన్ వాడుతున్నారు..? ఎంతమంది గుడి లో అనవసర చర్చను జరుపుతున్నారు..? ఎంతమంది భక్తి లేకుండా ప్రవర్తించారు..? అంటూ ప్రశ్నించాడు. దానికి అమ్మాయి.. నేను అవన్నీ పట్టించుకోలేదు నాన్నా.. నా దృష్టి అంతా గ్లాస్ పైనే ఉంది అంటూ చెప్పింది.
అప్పుడు ఆ తండ్రి నవ్వి.. నీవు గుడికి వెళ్ళినప్పుడల్లా.. నీ దృష్టిని ఆ భగవంతునిపైనే ఉంచు తల్లి.. ఎవరు ఎలా చేస్తున్నా నీవు గమనించాల్సిన అవసరం లేదు అంటూ పాఠం చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయికి జ్ఞానోదయం అయ్యి.. ఇంత చిన్న విషయానికా తాను కోపం తెచ్చుకుంది..? అని నవ్వుకుంది. ఇక నుంచి తానెప్పుడు గుడికి వెళ్లినా.. తన దృష్టిని భగవంతునిపైనే నిలుపుతాను అని ప్రతిజ్ఞ చేసుకుంది.
End of Article