ఈ మధ్యకాలంలో టెక్నాలజీ బాగా పెరగడంతో సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. సాధ్యం కాని విషయాలను కూడా గ్రాఫిక్స్ ద్వారా చేసి చూపిస్తున్నారు. మంచి అవుట్ పుట్స్ రాబడుతూ తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు. అయితే ఎటువంటి సాంకేతికత అందుబాటులో లేని కాలం లో ఎన్నో అద్భుతమైన చిత్రాలను మనకు అందించారు దిగ్గజ దర్శకులు.
Video Advertisement
‘మాయాబజార్’ సినిమా గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆ సినిమా విడుదలై ఆరు దశాబ్దాలు దాటినా ఇప్పటి తరానికి కూడా పరిచయమే. అంత గొప్ప సినిమా ‘మాయాబజార్’. ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఏఎన్నార్, సావిత్రి, గుమ్మడి వంటి హేమాహేమీలు నటించిన భారీ చిత్రం. తెలుగు సినిమా చరిత్రలోనే ‘మాయాబజార్’ ఒక ఆణిముత్యం.
ఎటువంటి గ్రాఫిక్స్ లేని కాలం లో కూడా కెమెరా యాంగిల్స్ తోనే అద్భుతమైన గ్రాఫిక్స్ ని చూపించిన దర్శకుడు కెవి.రెడ్డి. 1957లో వచ్చిన ఆ సినిమా అప్పట్లోనే కోటి రూపాయలకు పైగా షేర్స్ ను అందించి ప్రపంచాన్ని ఆకర్షించింది. ల్యాప్ టాప్ రాక ముందే ఈ సినిమాలో వీడియో కాలింగ్ చూపించారు. ఇలాంటివి ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి ఈ చిత్రం లో. భైరవి చిత్రం తో పేరు తెచ్చుకున్న సినిమాటోగ్రాఫర్ మార్కస్ బార్ట్లే తన కెమెరా పనితనంతో వెండితెరపై అద్భుతాలను ఆవిష్కరించారు.
ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా కొన్ని ట్రిక్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. వివాహ భోజనంబు.. లాహిరి లాహిరి పాటల చిత్రీకరణ మార్కస్ బార్ట్లే ట్యాలెంట్ కి నిదర్శనం. వివాహ భోజనంబు పాటలో ఘటోత్కచుడు భోజనానికి ఉపక్రమించి ఒక్క లడ్డు కొరికి చూస్తాడు. ఆపైన మొత్తం లడ్డూలన్నీ ఆయన నోరు తెరవగానే నోట్లోకి వరుసగా వెళ్లిపోతాయి. ఇలా ఎగిరినట్లు ఏ రకమైన గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే ఎలా వెళ్లిందో ఇప్పుడు చూద్దాం..
కళా దర్శకులు కళాధర్ – గోఖలే పారదర్శక కాగితంతో ఒక గరాటు తయారుచేయించారు. ఎస్వీ రంగారావు కూర్చుంటే ఎక్కడికి నోరు వస్తుందో చూసుకుని అక్కడికి గరాటులోంచి లడ్డూలు కిందికి వదులుతారు. గరాటులోంచి జారి ప్లేట్లో లడ్డూలు పడతాయి. దాన్ని చిత్రీకరిస్తారు. బార్‌ట్లే లైటింగ్ కూడా కొంత గరాటును కనిపించనివ్వకుండా మాయ చేసివుండాలి. అప్పుడు లడ్డూలు ఏ ఆధారం లేకుండా కిందికి పడినట్టు చిత్రీకరించవచ్చు. తర్వాత ఆ షాట్ ని రివర్స్‌లో ప్లే చేశారు. వారికి కావాల్సినట్టు లడ్డూలు ప్లేట్‌లోంచి నోట్లోకి గాల్లో వెళ్తున్న దృశ్యం ఆవిష్కృతమయ్యింది.
బహుశా లడ్డూలు పడడం, ఎస్వీఆర్ కూర్చోవడం, నమలడం, కింద ప్లేట్లో లడ్డూలు ఖాళీ అవడం షాట్స్ ను వేరుగా చిత్రీకరించి ఉండాలి. అప్పుడు ఆ మూడింటినీ మల్టిపుల్ ఎక్స్‌పోజింగ్ పద్ధతిలో కలిపి చేస్తే లడ్డూలు వేస్తున్నవారు కనిపించకుండా చేసివుండొచ్చు. ఈ వివరాలను గతం లో కళాధర్ గారు గుర్తుచేసుకుని పులగం చిన్నారాయణ గారికిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అలాగే “లాహిరి లాహిరి లాహిరి”లో పాట సినిమాలో సందర్భం ప్రకారం పున్నమి వెన్నెల్లో వస్తుంది. వెన్నెల్లో నౌకా విహారం చేయాలని ముందు శశిరేఖాభిమన్యులు అనుకుంటారు. ఈ పాటను వెన్నెల్లో కాక మండుటెండలో తీశారు. సింగీతం శ్రీనివాసరావు గారు ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలను బట్టి ఆనాటి కాలం లో బ్లాక్ అండ్ వైట్ చిత్రీకరణ పైన, తమ కెమెరాలో ఏవి ఎలా చూపిస్తే ఎలా కనిపిస్తాయి అనే విషయం మీద మార్కస్ బార్ట్‌లే కి బ్రహ్మాండమైన పట్టు ఉంది.
ఏయే రంగులు కలర్‌లో ఎలా కనిపిస్తాయి, బ్లాక్ అండ్ వైట్‌లో ఎలా కనిపిస్తాయన్న విషయం మీద మార్కస్ బార్ట్‌లే వద్ద ఒక చార్ట్ ఉండేది. రెడ్, గ్రీన్ బ్లాక్ అండ్ వైట్‌లో ఒకేలా కనిపిస్తాయట. అందుకే మాయాబజార్‌లో కనిపించే మొక్కల్లో కొన్ని ఆకులకు పసుపు, కొన్ని ఆకులకు రోజా రంగు, పువ్వులకు మరో రంగు వేయించేవారట. ఔట్ డోర్ లొకేషన్లో పగలు తీసిన షాట్లు మేఘావృతమైన వాతావరణంలో తీసారు. అలాగే పగటి పూట ధారాళంగా వచ్చే కాంతిని అదుపు చెయ్యటానికి ND ఫిల్టర్ని వాడారు. నటీనటుల మొఖం మీద నీటి ప్రతిబింబం ఏర్పడటానికి అల్ల్యుమినియం షీట్ తో కాంతిని ప్రతిబింబించారు.
ఇక రథం చుట్టూ మంటలు వచ్చే సన్నివేశం. డబుల్ ఎక్స్‌పోజర్. ఆ రథం వేరుగా తీస్తారు, ఆ చెట్లూ మంటలూ వేరుగా తీస్తారు. ఆ తర్వాత రెండు ఎక్స్‌పోజర్లు ఒకదానిపై ఒకటి లేయర్ చేసే పద్ధతిలో కలుపుతారు. అప్పుడు వేరే షాట్‌లో ఉన్న రథం, ఇంకో షాట్లు ఉన్న మంటలూ ఒకే షాట్‌లో కనిపించి మనకు మంటల్లో రథం చిక్కుకున్న భ్రాంతి కలుగుతుంది.