కేబీసీ (కౌన్ బనేగా కరోడ్ పతి) షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో కు దేశమంతా అభిమానులు ఉన్నారు. అయితే.. ఈ షో లో పార్టిసిపేట్ చేసి కోటి రూపాయల్ని గెల్చుకున్న వారు తక్కువనే చెప్పాలి. తాజాగా ‘కెబిసి 13’ సీజన్ లో ఆగ్రా కు చెందిన హిమానీ బుందేలా అనే టీచర్ కోటి రూపాయలను గెల్చుకున్నారు.

himani 1

అదొక్కటే విశేషం కాదు. ఆమెకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆమె తన పదిహేనవ వయసులోనే కంటిచూపుని కోల్పోయింది. ఆమె ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. తన జీవితాన్ని ఎంతో ఆదర్శం గా తీర్చిదిద్దుకుంది. ఈ విషయం గురించే ఆమె మాట్లాడుతూ.. “నాకు దృష్టి లేదు నిజమే.. కానీ నా దృష్టి కోణం మాత్రం ప్రత్యేకమైంది..” అని చెప్తూ ఉంటుంది.

himani 4

ఆమె ఎపిసోడ్ ఆగష్టు 30 , 31 వ తేదీలలో ప్రసారమైంది. ఈ సీజన్ ఎపిసోడ్స్ లో కోటి గెలిచిన వ్యక్తి హిమానీ ఒక్కరే. కోటి తరువాత.. ఏడు కోట్ల ప్రశ్నకు కూడా చేరుకుంది. కానీ ఏడు కోట్ల ప్రశ్నకి సమాధానం విషయం లో ఆమెకు సందేహం ఉండడంతో.. ప్రశ్నను క్విట్ చేసి.. కోటి రూపాయలను గెలుపొందింది. ఇప్పటివరకు అన్ని సీజన్లలో కోటి రూపాయలను గెలిచినా విజేత గా హిమానీ నిలిచారు. ఈ షో లో కోటి గెలిచిన తొలి అంధ విజేత కూడా హిమానీ నే. ఆమె తనకు చూపు లేదని ఎప్పుడు బాధపడలేదు.

himani 3

ముఖం పై తన చిరునవ్వుని చెరగనివ్వలేదు. ఆమె తండ్రి విజయ్ సింహ్ ఓ ప్రైవేటు ఉద్యోగి. తల్లి సరోజ్ గృహిణి గా ఉండేది. వారికి ఐదుగురు సంతానం. వారిలో హిమానీ పెద్దది. ఓ సారి పదవతరగతి లో ఉన్నపుడు సైకిల్ పై వెళ్తూ పడిపోయి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం తరువాత ఆమె చూపు సన్నగిల్లడం మొదలైంది. వైద్యులు కూడా ఆమె రెటీనా పూర్తి గా కదిలిపోయింది అని చెప్పి సర్జరీ చేయాలన్నారు. 2012 లో సర్జరీ లు చేసాక.. ఆమెకు చూపు వచ్చింది. అప్పటికే మూడు సర్జరీలు అయ్యాయి.

himani 2

కొద్దిగానే చూపు వచ్చింది. ఇంకా బాగా వస్తుందేమోనని.. నాలుగోసారి సర్జరీ చేసారు. అది ఫెయిల్ అయ్యి హిమానీ పూర్తి గా అంధురాలి గా అయిపొయింది. అప్పటి నుంచి ఆరునెలల పాటు హిమానీ ముఖం పై నవ్వు లేదు. ఆమె తల్లితండ్రులు కూడా నిరుత్సాహ పడ్డారు. కొంతకాలానికి హిమానీ తిరిగి ఉత్సాహాన్ని పుంజుకుంది. గతం లో చెప్పి మానేసిన ట్యూషన్లను తిరిగి ప్రారంభించింది. పిల్లల చేతే పాఠాలు చదివించి.. వాటిని విడమర్చి చెప్పింది.

himani 5

ఆమె చెప్తే.. ఆ పిల్లలకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండేది కాదు. ఆమె మ్యాథమెటిక్స్ లో కూడా ప్రావీణ్యురాలు. పిల్లలచే ప్రశ్న చదివించుకుని.. ఆమె సమాధానం చెప్పేది. అలా మంచి టీచర్ గా పేరు సంపాదించుకుంది. తనకు కనిపించకపోయినా.. నోట్స్ లో రాసి చూపించేది. లోపాలను పక్కన పెట్టి.. జీవితాన్ని సంతోషం గా ఆస్వాదించాలి అనే దృష్టి కోణాన్ని తాను అలవర్చుకున్నానని హిమానీ పదే పదే చెబుతుంటుంది. లక్నో లోని డాక్టర్‌ శకుంతల మిశ్రా రిహాబిలిటేషన్‌ యూనివర్సిటీ లో ఆమె అడ్మిషన్ తెచ్చుకుంది. డిప్లమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ ను పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా సంపాదించుకుంది. మా ఇంట్లో నాదే తొలి ప్రభుత్వ ఉద్యోగం అని హిమానీ గర్వం గా చెబుతారు. నేటి తరం విద్యార్థులకు హిమానీ ఆదర్శం గా నిలుస్తున్నారు.