Ads
దేవాలయాలకు పుట్టిల్లు మన భారతదేశం. ప్రతి గ్రామంలోని ఏదో ఒక మందిరం ఆ మందిరానికి ఒక విశిష్టత ఉంటాయి. అలాంటి ఒక మహిమాన్వితమైన గుడి తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఉంది. ఈ క్షేత్రంలో ఎక్కడా లేనివిధంగా మొగలిరేకులతో శివునికి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న నీటి గుండం నుంచి పూజా విధానం వరకు అన్ని విశిష్టతలే. స్కాంద పురాణం ప్రకారం కేతకి అనే అప్సరస కొన్ని కారణాల వలన ముని శాపంతో మొగలివనంగా మారుతుంది.
Video Advertisement
అదే కేతకి వనంలో బ్రహ్మ శివుని కోసం తపస్సు చేయగా ప్రత్యక్షమైన శివుడు బ్రహ్మ కోరిక మేరకు బాణలింగ రూపంలో అక్కడే వెలిశాడు. అందుకే ఈ క్షేత్రానికి కేతకి సంగమేశ్వర క్షేత్రమని పేరు. ఈ ఆలయం వెనుక భాగంలో ఒక గుండం ఉంటుంది. కాశీలో ప్రవహించే గంగానది యొక్క ఒక ధార భూగర్భ మార్గాన వచ్చి ఈ గుండంలో కలుస్తుందని భక్తుల నమ్మిక. మధ్యాహ్నం స్వామివారికి నైవేద్యం ఈ గుండంలోనే పెడతారు.
ఈ గుండానికి ఉన్న గోడకు ఒక రంధ్రం ఉంది గుండంలో నీరు నిండుగా ఉన్నప్పుడు ఆ రంధ్రం కనిపించదు ప్రతిరోజు మధ్యాహ్నం గుండంలోని నీటిని ఆ రంధ్రం ద్వారా సగం వరకు వదిలేస్తారు. ఆ సమయంలో స్వామివారికి ఒక ఆకులో నైవేద్యం పెట్టగా అది నీటితో పాటు ఆ రంధ్రం గుండా వెళ్ళిపోతుంది అలా ఆ నీరు ఒక సొరంగంలోనికి వెళుతుందని భక్తుల నమ్మిక. నీటితోపాటు నైవేద్యం కూడా లోపలికి వెళ్ళిపోతుంది.
కాసేపటి తర్వాత ఆ గుండం స్వచ్ఛమైన నీటితో పూర్తిగా నిండిపోతుంది ఇదంతా సంగమేశ్వరుని లీలగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు కింద ఒక శివలింగం ఉంటుంది. దానిని కేవలం చేతి వేళ్ళతో పైకి లేపితే వారి కోరికలు నెరవేరుతాయి అని ప్రజలు నమ్మకం దీనిని కోరికల లింగం అని కూడా అంటారు. ఇక్కడ శివరాత్రికి తొమ్మిది రోజులపాటు ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. అలాగే కార్తీకమాసంలో పార్వతి సంగమేశ్వరుల కళ్యాణం వైభవంగా జరుగుతుంది.
End of Article