Ads
ఇటీవల ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ సినిమాలో కుమ్రం భీము గా నటించిన ఎన్టీఆర్ నటన కూడా ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించేదిగా ఉంది. కానీ, సినిమాలో కొంత కల్పిత భాగం ఉన్నప్పటికీ.. నిజమైన కుమ్రం భీము చరిత్ర చాలా మందికి తెలియదు. వాస్తవానికి, కుమ్రం భీము పేరుని రకరకాలుగా రాస్తున్నారు.
Video Advertisement
కొమరం భీం, కొమురం భీం, భీమ్.. ఇలా రాస్తూ వస్తున్నారు. కానీ, బీబీసీ కధనం ప్రకారం కుమ్రం భీము సరైనది. ఆదివాసీలు బీబీసీ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే వెల్లడించారు.
1900 ల కాలంలో నిజాం తరహా అణచివేత, బ్రిటీషర్ల పాలన కొనసాగుతూ వచ్చింది. ఆ సమయంలో కొత్త చట్టాలు ఎన్నో వచ్చాయి. వ్యాపార అవకాశాలు విస్తరిస్తున్న ఆ కాలంలో వస్తున్న కొత్త చట్టాలు ఆదివాసీలకు ఇబ్బందులుగా పరిణమించాయి. ఎంతో కాలంగా వ్యవసాయం చేస్తూ వస్తున్న ఆదివాసీలకు కొత్తగా వచ్చిన చట్టాలు చుక్కలు చూపేవి. ఎవరెవరో వచ్చి.. ఆ భూమి తమదని, ఖాళీ చేయాలనీ కోరుతూ ఉండేవారు. పండించిన పంటని లాక్కునే వారు. వడ్డీ వ్యాపారుల వలన కూడా ఇబ్బందులు వచ్చేవి. మరోవైపు కట్టెలు కొట్టుకోవడానికి వీలు లేని పరిస్థితి ఉండేది. ఇలా ఆదివాసీల గోండు కుటుంబాలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఒకటీ, రెండూ కాదు. అలాంటి కుటుంబాల్లోనే కుమ్రం భీము కుటుంబం కూడా ఉండేది.
సంకెపల్లిలోని వ్యాపారులు, అటవీ అధికారుల కారణంగా భీము కుటుంబం కూడా చాలా బాధలను ఎదుర్కొంది. భీము తండ్రి మరణించిన తరువాత వీరి కుటుంబం సుర్దాపూర్‌లో స్థిరపడ్డారు. అక్కడ పంటలు పండించే నాటికి భీముకు 15 సంవత్సరాల వయసు వచ్చింది. పంట చేతికందే సమయానికి.. ఆ స్థలం నాదంటూ ఓ ముస్లిం వ్యక్తి వచ్చారు. ఆ సమయంలో భీము వారితో గొడవపడ్డారు. అంతే కాదు… సిద్ధిక్ అనే వ్యక్తి తలపై కూడా కొట్టారు. అక్కడ నుంచి పారిపోయిన కుమ్రం భీము అస్సాం చేరుకున్నారు. అక్కడే కొంతకాలం టీ తోటలో పని చేసారు. అక్కడే రాయడం, చదవడం నేర్చుకున్నారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్న తిరుగుబాట్ల గురించి కుమ్రం భీము అక్కడే తెలుసుకున్నాడు. మన్నెం దొర అల్లూరి సీతారామరాజు గురించి కూడా కుమ్రం భీము తెలుసుకున్నాడని “అల్లం రాజయ్య” అనే రచయిత “కుమ్రం భీము” అనే పుస్తకంలో పేర్కొన్నారు.
మన్నెం తిరుగుబాట్ల గురించి కూడా కుమ్రం భీము తన సహచరులతో చెప్తూ ఉండేవాడట. అస్సాం టీ తోటలలో పని చేసే రోజుల్లోనే అక్కడ కూడా తిరుగుబాట్లలో కుమ్రం భీము పాల్గొనే వాడట. అక్కడ నిర్బంధిస్తే.. అక్కడినుంచి తప్పించుకుని లచ్చు పటేల్ వద్ద పనిలో చేరారట. అక్కడే.. సోమ్ బాయిని వివాహం చేసుకున్నారట. ఆ తరువాత ఆసిఫాబాద్ జిల్లా బాబెఝరి గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని 12 గ్రామాల ఆదివాసీలను కలుపుకుని అడవులని నరికి వ్యవసాయ భూములుగా సాగు చేశారట. దీనితో పోలీసులు పెద్ద విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వానికి, ఆదివాసీలకు మధ్య చర్చ నడిపే వ్యక్తిగా కుమ్రం భీము వ్యవహరించారు.
రోజు రోజుకు అధికారులతో ఇబ్బందులు ఎక్కువ అవ్వడం, పంట చేతికి రాకపోవడం వంటి సమస్యలు వస్తుండడంతో కుమ్రం భీము విసిగిపోయాడు. దీనితో 12 గ్రామాల ఆదివాసీలను కలుపుకుని పోరాటాలు చేసారు. అడవి, అడవి పై హక్కులు, అడవి చుట్టూ ఉన్న భూమి, అక్కడ దొరికే నీరు పై ఆదివాసీలకు హక్కులు ఉండాలని కుమ్రం భీము ప్రధాన ఉద్దేశ్యంగా ఉండేది. ఈ ఉద్దేశ్యంపైనే ఆయన అనేక పోరాటాలు చేసారు. “జల్- జమీన్- జంగల్ ” అనే నినాదంపై భీము పోరాటం చేసాడు.
అయితే.. ప్రభుత్వం కుమ్రం భీముతో చర్చలు జరిపినప్పటికీ అవి సఫలం కాలేదు. దీనితో పోలీస్ బలగాలు దాడికి దిగాయి. దాదాపు ఏడు నెలల పాటు ఆ గ్రామాలలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఓ వైపు నిజాం సేనలు, మరోవైపు కుమ్రం భీము ఆధ్వ్యర్యంలో ఆదివాసీలు దాడులు చేసుకున్నాయి. ఊహించని విధంగా 300 ల పైగా మందుగుండు సామగ్రితో పోలీసులు కుమ్రం భీము ఉంటున్న స్థావరాలపై వెనుక వైపు నుంచి వెళ్లి దాడి చేసారు. భీము తో పాటు మొత్తం 15 మందిని కాల్చి చంపేశారు. ఆ తరువాత మిగిలిన వారిని అరెస్ట్ చేసారు. కుర్దు పటేల్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం వల్లే కుమ్రం భీము స్థావరాలు పోలీసులకు తెలిసాయి. 1940 సెప్టెంబర్ 1 వ తేదీన కుమ్రం భీము చనిపోయారు. 1946 లో తెలంగాణ సాయుధ దళాలు ఈ కుర్దు పటేల్ అనే వ్యక్తిని కాల్చి చంపేశాయి.
End of Article