Ads
రామాయణం. ఇది తెలియని భారతదేశ ప్రజలు ఉండరు ఏమో. తరతరాల నుండి రామాయణాన్ని చెప్తూ వస్తున్నారు. ఒక వారసత్వంగా తమ నుండి తమ పిల్లలకి, వారు వారి పిల్లలకి ఇస్తూ ఉన్నారు. రామాయణ ఘనతని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలి అనే ఉద్దేశంతో పుస్తకాలు రాయడంతో పాటు, సినిమాలు కూడా రూపొందిస్తున్నారు. అలాగే ఎన్నో భాషల్లో ఇవి అందుబాటులో ఉండేలాగా చూస్తున్నారు. రామాయణంలో ఉండే వారి గురించి అందరికీ తెలుసు. సీతారాములు, లక్ష్మణుడు, దశరథుడు, భరతుడు ఇలా అందరి గురించి తెలుసు.
Video Advertisement
కానీ శ్రీరాముడికి ఒక సోదరి ఉన్నారు అన్న విషయం ఎంత మందికి తెలుసు? శ్రీరాముడికి కేవలం తమ్ముళ్లు మాత్రమే ఉన్నారు అని చాలా మంది అనుకుంటారు. కానీ శ్రీరాముడికి ఒక సోదరి ఉన్నారు. ఆమె పేరు శాంత. శాంత శ్రీరాముడికి అక్క అవుతారు. కౌసల్య ముందుగా ఒక ఆడపిల్లకి జన్మనిచ్చారు. ఆమెకి శాంత అని నామకరణం చేశారు. ఆ పాపకి కాలు సరిగ్గా లేదు. దగ్గరి బంధువులు పెళ్లి చేసుకోవడం వలన పాప అలా ఉంది అని, ఎవరికైనా దత్తత ఇస్తే పాప మామూలుగా అవుతుంది అని మహర్షులు చెప్తారు. దాంతో అంగదేశాధీశుడైన రోమపాదుడు అనే రాజుకి శాంతని దత్తత ఇచ్చారు. రోమపాదుడి భార్య, కౌసల్యకి సోదరి అవుతారు. రోమపాదుడికి సంతానం లేదు.
అందుకే ఆ దంపతులకు శాంతని దత్తత ఇచ్చారు. ఆ తర్వాత శాంత మామూలుగా అయ్యారు. అంగ రాజ్యంలో శాంత పెరిగారు. ఒకరోజు శాంత, రోమపాదుడితో ఒక చర్చలో ఉన్నప్పుడు, అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చి, తాను వ్యవసాయం చేయాలి అనుకుంటున్నట్టు చెప్పి, అందుకు ఏమైనా సహాయం అందించమని అడుగుతాడు. చర్చలో మునిగిపోయిన కారణంగా రోమపాదుడు బ్రాహ్మణుడి మాటని వినిపించుకోలేదు. దాంతో తన భక్తునికి జరిగిన అవమానాన్ని ఇంద్రుడు సహించలేక అంగరాజ్యం కరువుతో అల్లాడుతుంది అని చెప్తారు. ఎన్నో సంవత్సరాలు గడుస్తాయి. అంగ రాజ్యంలో వర్షాలు కురవవు.
దాంతో ఒక గుణవంతుడు అక్కడ యాగం చేస్తే రాజ్యంలో వర్షాలు కురుస్తాయి అని రాజ గురువులు చెప్పడంతో, రుష్యశృంగుడు అనే ముని కుమారుడిని ఆకర్షించి రాజ్యానికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో శాంత వెళ్తారు. శాంతని చూసి రుష్యశృంగుడు ఇష్టపడడంతో వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. అసలు శ్రీరాముడి జననానికి కూడా ఒకరకంగా శాంత కారణం అని అంటారు. ఎందుకంటే దశరధుని చేత రుష్యశృంగుడు పుత్రకామేష్టి యాగాన్ని చేయిస్తారు. ఆ యాగానికి ఫలంగానే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మిస్తారు. కొంత మంది శాంత కథ కల్పితం అని కూడా అంటారు. కానీ ఉత్తరాదిన రిషివంశి అనే క్షత్రియ వంశం వాళ్ళు ఉంటారు. వాళ్లు రుష్యశృంగుడు, శాంత దంపతుల వారసులం అని నమ్ముతారు. రుష్యశృంగుడు, శాంత పేరున నేపాల్ లో మహాలక్ష్మి అనే ఒక ప్రదేశంలో గుడి ఉంది.
ALSO READ : ఈ 7 సుగుణాల వల్లే… శ్రీరాముడు “ఆదర్శ పురుషుడు” అయ్యాడా..?
End of Article