‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ అటు మహేష్ బాబు ఇటు రాజమౌళి ఇద్దరూ కూడా తాము కలిసి సినిమా చేస్తున్నామనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పదేళ్ల నుంచి వీరిద్దరి సినిమా కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.
Video Advertisement
మహేష్‌తో గ్లోబల్ మూవీగా, యాక్షన్ అడ్వెంచరస్ జోనర్‌లో సినిమాను తెరకెక్కించబోతున్నట్లు రాజమౌళి ఎప్పుడో చెప్పేశారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ తో తన 28వ సినిమా చేస్తున్నాడు. హారిక హాసిని బ్యానర్ మీద భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ తరువాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా ప్రారంభించనున్నారు.
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంత వరకు రానటువంటి కథాంశంతో రాజమౌళి ఈ సినిమా చేయబోతున్నాడు అని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఇంటరెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే ఏకంగా 15 కోట్ల రూపాయల వరకు జక్కన్న ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ కు రావడంతో జూన్ లేదా జులై లో ఈ సినిమా లాంచింగ్ ఉండనుందని తెలుస్తోంది. పూజా ఫార్మాలిటీస్ ను అప్పుడు పూర్తి చేసి రెగ్యులర్ షూటింగ్ మాత్రం అక్టోబర్ తర్వాత స్టార్ట్ చేయవచ్చు అని తెలుస్తోంది.
రాజమౌళి పక్కా ప్రణాళికతో ఈ సినిమా షూటింగ్ ను ఒక ఏడాదిలోనే పూర్తిచేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. వీరి ప్రాజెక్ట్ 2025 లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా కథను సిద్ధం చేసే పనిలో జక్కన్న, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ బిజీగా ఉన్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇప్పటి వరకు రూపొందని విధంగా రూ.800 కోట్ల రూపాయల బడ్జెట్‌తో SSMB29 ను రూపొందించటానికి రాజమౌళి ప్లాన్ చేశారట. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్.నారాయణయ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.