సాధారణంగా సినిమాలను ఒకరు లేదా ఇద్దరు నిర్మాతలు లేదంటే ఒక నలుగురు, ఐదు మంది నిర్మాతలు కలిసి నిర్మిస్తారు.ఇది మామూలుగా జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం సినిమాకు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే నిర్మాతలుగా వ్యవహరిస్తూ ఉంటారు.కానీ ఇక్కడ మాత్రం ఒక సినిమాకు ఏకంగా ఒకటి రెండు కాదండోయ్ 5 లక్షల మంది నిర్మాతలు ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అదే భారత దేశం లో.. ప్రపంచం లోనే తొలి క్రౌడ్ ఫండింగ్ చిత్రం ‘మంథన్’.
Video Advertisement
దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తిని పెంచడంలో విశేష కృషిచేసి శ్వేత విప్లవ పితామహుడిగా గుర్తింపు తెచ్చుకున్న వర్గీస్ కురియన్ జీవిత కథ నేపథ్యంలో… దిగ్గజ దర్శకుడు అయిన శ్యామ్ బెనెగల్ తెరకెక్కించిన సినిమా ఇది. వర్గీస్ కురియన్ రాకతో గుజరాత్ పాడి రైతుల జీవితాలలో కొత్త వెలుగులు నిండాయి..ఈ సినిమా నిర్మాణానికి రైతులు భాగస్వామ్యం వహించడం అన్నది గొప్ప విశేషం.
ఈ సినిమా నిర్మాణానికి రైతులు భాగస్వామ్యం వహించడం సముచితం అనే శ్యామ్ ఆలోచనకు గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ముందుకొచ్చింది. ఈ సినిమాకు 5 లక్షల మంది తలో రెండు రూపాయలు అందించారు. ఇలా అందించిన వారు ఎవరో కాదు. పాడి రైతులు. వీరు సినిమా నిర్మించడానికి విరాళం ఇవ్వడమే కాకుండా ఆ సినిమాను చూసి విజయవంతం చేశారు.
గిరీశ్ కర్నాడ్, నసీరుద్దీన్ షా, అమ్రిష్ పురి, స్మితా పాటిల్, తదితరులు కీలక పాత్రల్లో నటించిన మంథన్ సినిమాను విజయవంతం చేసేందుకు గుజరాత్ పాడి రైతులు గుంపులు గుంపులుగా థియేటర్లకు వచ్చారు. వర్గీస్ జీవిత కథను తెలుసుకొని ఎంతో సంతోషించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందడమే కాకుండా పలు జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది. వ్యవసాయ రంగంలో ఒక వ్యక్తి సాధించిన విజయాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు 5 లక్షల మంది రైతులు తమ తోడ్పాటునందించడంపై అప్పట్లో అందరూ అభినందించారు.
అంతే కాకుండా పాల ఉత్పత్తి కోసం ఎంతగానో సేవ చేసిన వర్గీస్ కురియన్ కు కేంద్ర ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది.
1963 లో రామన్ మెగాసెసె అవార్డు, 1965 లో పద్మశ్రీ,1966 లో పద్మభూషణ్, 1986 లో కృషి రత్న,1986 లో వాట్లర్ శాంతి బహుమతి, 1989 లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్, 1993 లో ఇంటర్నేషనల్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, 1997 లో ఆర్డర్ ఆఫ్ అగ్రికల్చరల్ మెరిట్, 1999 లో పద్మ విభూషణ్ అవార్డుతో కేంద్రం ఆయనను సత్కరించింది.