సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన గొప్ప నటుల సినిమాలను తలచుకుంటే ఎంత ఆనందం కలుగుతుందో..కొన్నిసార్లు వారున్న పరిస్థితి తెలుసుకుంటే మనసు ఎంతగానో తల్లడిల్లిపోతుంది. ఇండస్ట్రీలో ఓ స్టార్ గా వందల చిత్రాలలో నటించిన ప్రముఖ నటి.. వయసు మీదపడ్డాక ఆర్థికంగా చితికిపోయి రోడ్డునపడ్డ ఘటనలు ఇప్పుడున్న కాలంలో చూడడం మన దురదృష్టం అనే చెప్పాలి.
Video Advertisement
సౌత్ ఇండియాను దశాబ్దాలపాటు అలరించిన అలనాటి తార జయకుమారి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ప్రత్యేక గీతాల్లో నర్తకిగా వందల చిత్రాల్లో నటించిన జయకుమారి.. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగాలేక వైద్యం కోసం ఎదురు చూస్తోందని సమాచారం.
కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది జయకుమారి. ఆమెకు ఇద్దరు కుమారులు. భర్త ఇటీవల మరణించడంతో ఆర్ధికంగా దీనస్థితికి చేరుకుందని సినీవర్గాలు చెబుతున్నాయి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఆమె అనేక సినిమాల్లో నటించారు. అప్పట్లో స్టార్ డం అనుభవించిన ఆమె ప్రస్తుతం ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. మరో వైపు రెండు కిడ్నీలు దెబ్బ తినడంతో తమిళనాడులోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నట్లు తెలుస్తోంది.
ఆమె కుమారుల ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగుండకపోవడంతో ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంటుందని సమాచారం. ఈ విషయాన్ని తెల్సుకున్న తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి సుబ్రమణియన్ ఆమెను పరామర్శించారు. ఆమెకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని వైదులను ఆదేశించారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని, ఆర్థిక సాయం, సొంత ఇల్లు, పింఛన్ వంటి ఏర్పాట్లు చేస్తానని ఆయన జయకుమారి గారికి హామీ ఇచ్చారు.
అలాగే మలయాళం, తమిళ, తెలుగు ఇండస్ట్రీల వారు ఎవరైనా స్పందించి జయకుమారి వైద్యానికి సాయం చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో కోరుతున్నారు. జయకుమారి తెలుగులో బాలమిత్రులకథ, మానవుడు దానవుడు, సంపూర్ణ రామాయణం, కళ్యాణ మండపం, ఇంటి గౌరవం లాంటి సినిమాలలో నటించారు.