హీరోయిన్స్ కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా బయట కూడా ఎన్నో మంచి పనులు చేసి తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వారిలో ఒకరు ప్రణీత సుభాష్. తెలుగు, తమిళ్, కన్నడలో ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు ప్రణీత. ప్రణీత కొంత కాలం క్రితం హాసన్ లోని ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నారు.

తర్వాత ఆ పాఠశాలని బాగు చేయిస్తాను అని ప్రమాణం చేశారు. చెప్పినట్టుగానే ప్రణీత తన మాట నిలబెట్టుకున్నారు. ఒక ఎన్జీవో కి చెందిన కొందరు వాలంటీర్లతో ప్రభుత్వ పాఠశాలకు వచ్చి పెయింట్స్ వేశారు. ఈ విషయం పై ప్రణీత మాట్లాడుతూ, “ఈ ఈవెంట్ కి మేము హోలీ అని పేరు పెట్టాం. మేమందరం మా చేతులతో స్కూల్ కి పెయింటింగ్ వేశాం. చాలా సంతోషంగా అనిపించింది.

ఇక్కడ నీళ్ల సౌకర్యం కూడా సరిగ్గా లేదు. అందుకే స్కూల్ కి పర్మనెంట్ వాటర్ కనెక్షన్ ఇప్పించాం. ఇదంతా ఒక అచీవ్మెంట్ లాగా అనిపిస్తోంది. ఇలాంటి పనులన్నీ మనల్ని గ్రౌండెడ్ గా ఉండేలా చేస్తాయి. ఇది గ్లామర్ ప్రపంచానికి చాలా దూరంలో ఉండే పని. అయినా సరే ఇలాంటి పనులు చేయడం వల్ల ఎంతో తృప్తిగా అనిపిస్తుంది” అని అన్నారు.

అంతే కాకుండా ప్రణీత సుభాష్, ప్రణీత ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటూ, ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. ఫ్రీ హెల్త్ చెకప్ ఇలాంటివి కూడా ఈ ఆర్గనైజేషన్ ద్వారా కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే కరోనా సమయంలో ఎంతో మంది అవసరమైనవారికి ఆహారాన్ని అందించడానికి ప్రణీత ఫౌండేషన్ ముందుకు వచ్చి తమ వంతు సహాయం చేసింది.

ప్రణీత ఫౌండేషన్ ద్వారా సహాయం పొందిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాగే బెంగళూరు లోని ఇంకొక గవర్నమెంట్ స్కూల్ ని కూడా ఈ ఫౌండేషన్ ద్వారా బాగు చేశారు. అంతే కాకుండా కర్ణాటకలోని ప్రభుత్వ విద్యా వ్యవస్థలను పునరుద్ధరించాలని అక్కడి వారు నిర్వహిస్తున్న సేవ్ గవర్నమెంట్ స్కూల్స్ మూమెంట్ కి కూడా ప్రణీత ట్రస్టీగా ఉన్నారు.