సాధారణంగా చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. హౌస్ వైఫ్ అంటే ఉద్యోగం చేసే ఆడవాళ్ళ కంటే పని తక్కువగా ఉంటుంది అని. అందుకే చాలా మంది హౌస్ వైఫ్ అంటే ఇంటి బాధ్యతలు చూసుకునే వాళ్ళు అని కాకుండా ఇంట్లో ఉండే వాళ్ళు అని అంటారు.

Video Advertisement

కానీ అలా ఆలోచించడం తప్పు అని ఒక సైకాలజిస్ట్ కి, అలాగే తన భార్య ఏం పని చేయదు అని కోపంగా ఉన్న ఒక భర్త కి మధ్య జరిగిన ఈ సంభాషణ చదివితే మీకు కూడా అర్థమవుతుంది.

representative image

సైకాలజిస్ట్ : ప్రాబ్లం ఏంటి?
రమేష్ : నా భార్య అసలు ఒక్క పని కూడా చేయదు.
సైకాలజిస్ట్ : మీరేం చేస్తుంటారు?
రమేష్ : నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను.
సైకాలజిస్ట్ : మీ భార్య ఏం చేస్తూ ఉంటారు?
రమేష్ : ఏం చేయదు. ఇంట్లోనే ఉంటుంది.
సైకాలజిస్ట్ : మీ ఇంట్లో అందరి కంటే ముందు మీలో ఎవరు నిద్రలేస్తారు?
రమేష్ : నా భార్య. నాకు టిఫిన్, లంచ్ అన్ని ప్రిపేర్ చేయాలి కదా. అందుకే.

సైకాలజిస్ట్ : మీ పిల్లలని స్కూల్ కి ఎవరు తీసుకెళ్తారు?
రమేష్ : ఖాళీగా ఉంటుంది కాబట్టి నా భార్యే తీసుకెళ్తుంది.
సైకాలజిస్ట్ : పిల్లలు స్కూల్ కి వెళ్లిపోయిన తర్వాత మీ భార్య ఏం చేస్తారు?
రమేష్ : బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం, గిన్నెలు తోమడం.
సైకాలజిస్ట్ : మీ పిల్లలకి హోం వర్క్ చేయించడం లాంటి పనులను ఎవరు చూసుకుంటారు?
రమేష్ :
నేను ఆఫీస్ లో అలిసిపోయి ఇంటికి వస్తాను కదా? ఎలాగో ఖాళీగా ఉంటుంది కాబట్టి హోంవర్క్ అంతా నా భార్య చేయిస్తుంది.
సైకాలజిస్ట్ : మరి డిన్నర్ అదంతా ఎవరు చేస్తారు?
రమేష్ : ఇంకెవరు? నా భార్యే చేస్తుంది.

representative image

సైకాలజిస్ట్ : ఇంట్లో అందరికంటే ఆలస్యంగా ఎవరు పడుకుంటారు?
రమేష్ : నేను ఆఫీస్ నుంచి అలిసిపోయి వస్తాను కదా? అప్పటికే నిద్ర వచ్చేస్తుంది. ఇంకా మళ్లీ నెక్స్ట్ డే ఆఫీస్ కి టైం కి వెళ్ళాలి కాబట్టి తొందరగా కూడా లేవాలి. అందుకే నేను తొందరగా పడుకుంటాను. అందరం తిన్న తర్వాత గిన్నెలు శుభ్రం చేసి, పిల్లలని పడుకోబెట్టి, నా భార్య పడుకుంటుంది.
సైకాలజిస్ట్ : దీన్ని బట్టి చూస్తే ఎక్కువ పని ఎవరు చేస్తున్నారు?

విషయం అర్థమైన రమేష్ కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
సైకాలజిస్ట్ : మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. కానీ మీ ఉద్యోగానికి టైమింగ్స్ ఉంటాయి. మీ భార్య రోజు మొత్తం విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉన్నారు. మీ భార్య ఇంటి బాధ్యతలు తీసుకున్నారు కాబట్టే, మీరు ఆఫీస్ లో అంత ప్రశాంతంగా పని మీద దృష్టి పెట్టగలుగుతున్నారు. ఇప్పుడు మీ భార్య చేసే పనుల గురించి మీరే చెప్పారు. కాబట్టి, ఈసారి నుంచి మీ భార్య ఏ పని చేయట్లేదు అనే ముందు మీరు చెప్పిన మాటలనే ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోండి.

రమేష్ మాత్రమే కాదు. మనలో చాలా మందికి ఇంట్లో ఉండే వాళ్ళు ఏ పని చేయరు అనే ఒక భావన ఉంటుంది. కానీ ఇంటి బాధ్యతలు నిర్వర్తించడం కూడా ఉద్యోగానికి తక్కువేమీ కాదు అన్న విషయం గుర్తుపెట్టుకుందాం. ఇంట్లో ఉన్నారు అని కాకుండా, ఇంట్లో ఉండి వాళ్లు ఎన్నో పనులు చేస్తున్నందుకు గౌరవిద్దాం.