మాస్ మహారాజా రవితేజ, అందాల భామ శ్రీలీల కాంబినేషన్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ధమాకా. రిలీజ్‌కు ముందు మ్యూజికల్‌గా అంచనాలు పెంచిన ఈ చిత్రం ఓ మోస్తారు అంచనాలతో విడుదలైంది. 23 డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచి సక్సెస్ టాక్‌తో దూసుకెళ్లింది. ట్రేడ్ వర్గాల అంచనాలకు మించి ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది.
Video Advertisement
ధమాకా సినిమా ప్రేక్షకులను అలరించడానికి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోల్స్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన కారణమని చెప్పవచ్చు. పాటలకు తగినట్టుగా శ్రీలీల వేసిన స్టెప్పులు, ఎప్పటిలానే రవితేజ మేనరిజం సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. తన రెండో చిత్రం తోనే శ్రీలీల తనలోని నటిని, డాన్సర్ ని ప్రేక్షకులకి పరిచయం చేసేసింది. అలాగే రెగ్యులర్ కథ అయినప్పటికీ.. త్రినాథ రావు సినిమాను రూపొందించిన విధానం సగటు ప్రేక్షకుడిని కట్టి పడేసిందని చెప్పవచ్చు.
క్రాక్ తర్వాత వచ్చిన రవితేజ చిత్రాలు ప్లాప్ కావడం తో ఈ చిత్రం పై పెద్దగా బిజినెస్ జరగలేదు. డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ధమాకా సినిమా విషయం ముందు వెనుక ఆలోచించారనేది ట్రేడ్ వర్గాల సమాచారం. ధమాకా చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇక ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ అంతా కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 18.5 కోట్ల మేర బిజినెస్ నమోదు చేసింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని 19.5 కోట్లుగా ట్రేడ్ వర్గాలు నిర్ణయించాయి.
అయితే ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 37 కోట్ల షేర్ 70 కోట్ల గ్రాస్ రూపాయలను వసూలు చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 3.5 కోట్లకుపైగా, అమెరికా, ఇతర దేశాల్లో 2.75 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల షేర్, 85 కోట్ల రూపాయాల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీంతో ధమాకా చిత్రం బాక్సాఫీస్ జర్నీ 19.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగి 25.5 కోట్లకుపైగానే లాభాన్ని ఆర్జించింది. రవితేజ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ధమాకా నిలిచింది.