ఇతరులకి హాని కలిగించే ఏ పని అయినా నేరం కిందకి వస్తుంది. ఒకొక్క నేరానికి ఒకొక్క శిక్ష ఉంటుంది. కొంత మందికి జైలు శిక్ష పడుతుంది. కొంత మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అసలు కొన్ని నేరాలకు ఏ శిక్ష అయినా తక్కువే అనిపిస్తుంది. అంత ఘోరమైన పని చేసిన నేరస్తుడు అసలు బతకడమే తప్పు అనిపిస్తుంది. అలాంటపుడు విధించేది మరణ శిక్ష.

ఈ మరణ శిక్ష క్షమించరాని నేరం చేసిన వాళ్ళకి విధిస్తారు. మనం చాలా సినిమాల్లో మరణ శిక్ష విధించే సీన్ చూసే ఉంటాం. మరణ శిక్ష విధించిన తర్వాత  జడ్జ్ పెన్ కి ఉన్న నిబ్ ని విరిచేస్తారు. అలా ఎందుకు చేస్తారో తెలుసా? మరణ శిక్ష విధించిన తర్వాత పెన్ యొక్క నిబ్ ని ఎందుకు విరుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ నిబ్ విరచడం అనేది ఇప్పుడు మొదలైంది కాదు. బ్రిటీష్ కాలం నుంచి పెన్ నిబ్ విరచడం అనేది పాటిస్తున్నారు. ఇది పాటించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే.

ఒకరి మరణ తీర్పుని రాసిన పెన్ తో ఇంకొకరికి తీర్పుని రాయకూడదు, లేదా ఇతర ఏ కారణంతో అయినా మళ్ళీ ఆ పెన్ ఉపయోగించకూడదు అని అలా విరుస్తారు. అంతే కాకుండా ఒక సారి తీర్పు ఇస్తే మళ్ళీ దానిని తిరిగి మార్చడం కానీ, పరిశీలించడం కానీ జరగదు అనే దానికి సంకేతంగా కూడా ఇలా చేస్తారు.