సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అని అంటారు. సూర్య సంక్రమణ జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఈ సంక్రమణాన్ని సంక్రాంతి పండుగ అంటారు. అయితే ఈ పండుగను పెద్ద పండుగ అని కూడా పిలుస్తారు. ఆంధ్రులు అందరూ అతి వైభవంగా ఈ పండుగని జరుపుకుంటారు. మొత్తం వరుసగా నాలుగు రోజుల పాటు ఈ పండగ ఉంటుంది.

Video Advertisement

మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, నాలుగో రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. భోగి నాడు పెద్ద పెద్ద భోగి మంటలు వేయడం అలానే హరిదాసు కీర్తనలు, రంగురంగుల రంగవల్లికలు, కోడిపందాలు, గాలిపటాలు ఎగురవేయడం, గంగిరెద్దులు, గొబ్బెమ్మలు ఇవన్నీ కూడా సంక్రాంతి సమయం లో మనం చూడొచ్చు. నిజంగా ఇవన్నీ కూడా చూడముచ్చటగా ఉంటాయి.

సంక్రాంతి రోజు అందరూ కూడా సూర్యుడు ఉదయించక ముందే అభ్యంగన స్నానం చేసి ఎంతో అందంగా ఇంటిని అలంకరించుకోవడం, పూజలు చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండివంటలు చేయడం లాంటివి చేస్తారు. అయితే ఇవన్నీ ఇలా ఉంటే తప్పక గొబ్బెమ్మలు పెడతారు. ఎందుకు అసలు సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మలు పెడతారు అనేదాని గురించి ఇప్పుడు చూద్దాం.

గొబ్బెమ్మలకి ప్రత్యేక స్థానం ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గౌరీ మాతగా గొబ్బెమ్మలని భావిస్తారు. కొన్నిచోట్ల అయితే కాత్యాయనీ దేవి అని అంటారు. పండుగ నాడు ముగ్గు వేసి ఆ ముగ్గు మీద గొబ్బెమ్మలు పెడతారు. వాటిపై పసుపు, కుంకుమలు వేసి పూజ చేస్తారు. చిన్న చిన్న పిల్లలు చేత పెద్ద వాళ్ళు పూజలు చేయించి వాటి చుట్టూ తిరగమని అంటారు.

సరదాగా గొబ్బెమ్మల పాటలు కూడా పాడుకోవడం.. అటుకులు బెల్లం వంటివి నివేదన చేసి పంచిపెట్టడం ఇలా ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు అనుసరిస్తుంటారు. అయితే గొబ్బెమ్మలు పెట్టి పసుపు, కుంకుమలతో పూజలు చేయడం వల్ల భర్త బ్రతికి ఉన్న పుణ్యస్త్రీ తో సమానం. అందుకే గొబ్బెమ్మను గోదాదేవిగా కూడా భావించి పూజ చేస్తారు. ఆడపిల్లలు ఇలా గొబ్బెమ్మలు పెట్టి ఆనందంగా వాటి చుట్టూ తిరిగి ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. పైగా గొబ్బెమ్మలు పెడితే సాక్షాత్తు లక్ష్మి దేవి మన ఇంటికి వచ్చినట్టే.