సుమారు 19 భారతీయ భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడి శ్రోతలను అలరించిన సింగర్ వాణీ జయరాం అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. చెన్నై లోని నుంగంబాక్కంలోని ఒక అపార్ట్మెంట్లో ఆమె మరణించారు. తమిళనాడులోని వేలూరులో జన్మించిన వాణి జయరాం వివాహం వరకు సింగింగ్ కెరియర్ మొదలుపెట్టలేదు, వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉద్యోగరీత్యా ముంబై వెళ్లిన ఆమె అక్కడ తన పాటల ప్రస్థానాన్ని మొదలు పెట్టారు.
Video Advertisement
తన సినీ ప్రస్థానం గురించి వాణీ జయరాం గతంలో పలు సందర్భాల్లో కొన్ని విశేషాలు పంచుకున్నారు. వీటిలో దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌తో ఆమె విభేదాల గురించి తెలియజేశారు. “నా కెరీర్ హిందీ సినిమాతోనే మొదలైంది. వసంత్ దేశాయ్ సినిమాతో గుడ్డీ అనే హిందీ చిత్రంలో పాటలు పాడాను. అవార్డులు కూడా వచ్చాయి. దీంతో నేను తనకు ఎక్కడ పోటీగా వస్తానోనని లతా మంగేష్కర్ భయపడ్డారు. ఒకసారి నేను ఆమెను కలవడానికి వెళ్తే .. ఆమె నన్ను కలవడానికి ఆసక్తి చూపించలేదు.
1979లో విడుదలైన మీరా మా మధ్య మరింత దూరాన్ని పెంచింది. మీరా చిత్రానికి పండిట్ రవిశంకర్‌ను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు దర్శకుడు గుల్జార్. తన సోదరుడిని మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకోకపోతే ఈ సినిమాలో తాను పాటలు పాడనని లతాజీ చెప్పారు. దాంతో గుల్జార్ నాతో ఆ సినిమాలోని పాటలన్నీ పాడించారు. అలా, లతాజీకి నాపై కోపం ఇంకా ఎక్కువైంది. కొన్నాళ్లకు బాలీవుడ్‌లో రాజకీయాలు నాకు నచ్చక తిరిగి మద్రాస్ వచ్చేశాను.” అని వాణీ జయరాం తెలిపారు.
సౌత్‌కు వచ్చిన తర్వాత మలయాళం చిత్రం స్వప్నం కోసం తన తొలి పాట పాడారు వాణీ జయరాం. తర్వాత దర్శకుడు కోదండపాణి తెరకెక్కించిన అభిమానవంతులు సినిమాతో తెలుగువారికి సుపరిచితులయ్యారు. ఈ చిత్రం తర్వాత నోము, పూజ, మరో చరిత్ర సీతా మహాలక్ష్మీ, శంకరాభరణం, సీతా కోక చిలుక, స్వర్ణ కమలం, స్వాతి కిరణం లాంటి పలు చిత్రాల్లో తెలుగులో పాటలు పాడారు. తెలుగులో ఆమె పాడినవి తక్కువ పాటలే అయినా ఆమె పాడిన పాటలన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి.