టెక్నాలజీ వల్ల అందరికీ జీవన విధానాల్లో మార్పు వచ్చింది. పూర్వకాలంలో పాటించే ఎన్నో పద్ధతులు ఇప్పుడు చాలా తక్కువగా పాటిస్తున్నారు. ఎందుకు అని అడిగితే అవన్నీ పాటించడం వల్ల సమయం వృధా అవుతుంది అని అంటున్నారు.

నిజానికి అసలు పూర్వకాలంలో పాటించే చాలా పద్ధతుల వల్ల అప్పటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జలుబు, దగ్గు లాంటి చిన్న చిన్న వాటికే బలహీన పడిపోతున్నారు. కానీ పాత తరం వాళ్ళు పాటించే ఆరోగ్య సూత్రాల వల్ల, చేసే కొన్ని పనుల వల్ల వారు అప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అవేంటంటే.

#1 పండగల లాంటివి ఉన్నప్పుడు గుమ్మానికి మామిడి ఆకుల తో చేసిన తోరణాలు కడతాం. మామిడి ఆకులు కోసిన తర్వాత కూడా కొన్ని గంటలపాటు ఆక్సిజన్ అందచేస్తాయట. ఇంటికి ఎక్కువమంది వచ్చినప్పుడు వాళ్లకి ఆక్సిజన్ సరిగ్గా అందడానికి మామిడాకులు కడతారట.

#2 నేల మీద కూర్చొని తింటే మనకు ఎంత ఆకలిగా ఉంటే అంత భోజనం మాత్రమే తినగలుగుతామట. అంతేకాకుండా కూర్చునే పద్ధతి వల్ల తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుందట. అందుకే పూర్వం నేల మీద కూర్చుని భోజనం చేసే వారట. ఇప్పుడు కూడా చాలా మంది ఈ పద్ధతిని పాటిస్తున్నారు. కానీ పాటించడం వెనుక ఉన్న కారణం తెలియదు.

#3 పసుపులో యాంటి బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి అన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. అందుకే క్రిములు ఇంట్లోకి ప్రవేశించకుండా పసుపును గడపలకి రాస్తారు. అంతేకాకుండా శరీరంపై ఉన్న బ్యాక్టీరియా పోవడానికి పసుపు ను రాసుకుంటారు.

#4 దాదాపు అందరూ హిందువుల ఇళ్ళల్లో తులసికోట ఉంటుంది. అంతేకాకుండా తులసి పూజ చేయడం కూడా ఎన్నో తరాల నుండి ఆనవాయితీగా వస్తోంది. తులసి పూజ చేసిన తర్వాత స్వీకరించే తులసి ఆకుల తీర్థం లో క్యాన్సర్ వంటి వ్యాధులను అరికట్టే గుణాలు ఉంటాయని వైద్యశాస్త్రంలో ఉందట.

#5 అప్పుడు బ్రష్ ఉపయోగించేవారు కాదు కాబట్టి ఉదయం లేవగానే వేప పుల్లలతో పళ్ళు తోముకునే వారు. వేప పుల్లలతో పళ్ళు తోముకోవడం వల్ల దంతాలు బలంగా ఉంటాయట అంతే కాకుండా గొంతు కూడా బాగుంటుందట. పొద్దున్నే వేప చెట్ల నుండి వచ్చే గాలి పీలిస్తే శ్వాస సంబంధిత సమస్యలు కూడా రావట.

#6 మన భోజనంలో ఉండే క్రిములను, విషాన్ని, ఇంకా శరీరానికి హాని కలిగించే పదార్థాలని గ్రహించే గుణం అరిటాకు కి ఉందట. అందుకే చాలామంది అరిటాకులో భోజనం చేసేవారట.

#7 చాలామంది ఇళ్లల్లో గోడకి పిడకలు కొట్టేవారు. ఇప్పుడు కూడా ఊళ్ల లో ఈ పద్ధతి పాటిస్తుంటారు. దానికి కారణం ఏంటి అంటే గోవు పేడలో సహజ సిద్ధమైన యాంటీ బయాటిక్స్ ఉంటాయట. వాటివల్ల బ్యాక్టీరియా అనేది రాదట. అంతేకాకుండా గోవు పేడను ఆర్గానిక్ పదార్థాల కోసం ఎరువుగా కూడా వాడతారు.