సచిన్…ఈ పేరుకి కొత్త పరిచయం అవసరంలేదు అనుకుంట. ఆయన క్రికెట్ బాట్ పట్టుకొని స్టేడియం లోకి వస్తుంటే…130 కోట్ల మంది భారతీయుల్లో ఒక కొత్త జోష్ కనిపిస్తుంది. క్రికెట్ చరిత్రలో అతన్ని ఎప్పుడు మరచిపోలేము. ఆయన సాధించిన రికార్డ్స్ ఎప్పటికి మరచిపోలేము. ఇతర దేశాల్లో కూడా సచిన్ కి అభిమానులు ఉన్నారంటే అర్ధం చేసుకోండి ఆయన స్థాయి. అందుకే క్రికెట్ దేవుడు అని పిలుస్తారు సచిన్ టెండూల్కర్ ని. అంత‌లా స‌చిన్ అంద‌రి మ‌న‌స్సుల్లో నిలిచిపోయాడు.

Video Advertisement

నవంబ‌ర్ 16, 2013 రోజును మనం ఎప్పటికి మరచిపోలేము. క్రికెట్ మైదానానికి, ఆ ఆట‌కు శాశ్వ‌తంగా వీడ్కోలు పలికిన రోజు అది. క్రికెట్ అభిమానులు అందరు కంటతడిపెట్టిన రోజు. ఇప్పటికీ స‌చిన్ అంటే క్రేజ్ అలాగే ఉంది. ఏ మాత్రం త‌గ్గలేదు. ఇప్పుడు సచిన్ క్రికెట్ గురించి కొద్దిసేపు పక్కన పెట్టి. ఆయన లవ్ స్టోరీ గురించి ఓ లుక్ వేసుకుందామా?. అయితే దాదాపుగా చాలా మంది క్రికెట‌ర్ల లాగే స‌చిన్ కూడా అంజ‌లిని ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇంత‌కీ… స‌చిన్ ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ ఎప్పుడు జ‌రిగిందో తెలుసా..?

అప్పుడు స‌చిన్‌కు 17 సంవ‌త్స‌రాలు. అప్ప‌టికే ప్ర‌ముఖ భార‌త క్రికెట‌ర్ గా పేరు తెచ్చుకున్నాడు. విదేశాలకు టూర్ వెళ్లి ఇండియాకు తిరిగి వ‌చ్చిన స‌చిన్‌ను చూసేందుకు ఎయిర్‌పోర్టులో అభిమానులు ఎగ‌బ‌డ్డారు. అయితే అదే స‌మ‌యానికి అంజ‌లి త‌న త‌ల్లిని ఎయిర్‌పోర్ట్ నుంచి పిక‌ప్ చేసుకోవడానికి వచ్చింది. అప్ప‌టికి అంజ‌లి వ‌య‌స్సు 22 సంవ‌త్స‌రాలు. ఈ క్ర‌మంలో అంజ‌లి స‌చిన్ ను మొద‌టిసారి ఎయిర్ పోర్టులో చూసి అప్పుడే అత‌ని ల‌వ్ లో ప‌డిపోయింది. ఓ ద‌శ‌లో త‌న త‌ల్లిని పిక‌ప్ చేసుకునే విషయం కూడా ఆమె మ‌రిచిపోయింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అంతేనేమో.ఆ త‌రువాత చాలా రోజుల‌కు అంజ‌లి మళ్లీ సచిన్ ను క‌లిసింది. అదీ… జ‌ర్న‌లిస్టు రూపంలో..!

 

సచిన్‌ను క‌లిసేందుకు జ‌ర్న‌లిస్టు అవ‌తారం ఎత్తింది. అత‌ని ఇంటికి జ‌ర్న‌లిస్టు రూపంలో వెళ్లి స‌చిన్‌ను ఎలాగో క‌లిసింది. అయితే ఈ విషయంపై ఇంట్లో ఎవ‌రికీ అనుమానం క‌ల‌గ‌లేదు. ఆ త‌రువాత 5 ఏళ్ల పాటు వీరు ప్రేమ‌లో మునిగి తేలారు. అయితే ఓ సారి సినిమా చూసేందుకు స‌చిన్‌, అంజ‌లి ఇద్ద‌రూ క‌లిసి వెళ్లారు.

అప్ప‌టికే స‌చిన్‌ ఎంతో ఫేమస్ అయ్యారు. ఆయనను బ‌య‌ట ఎవ‌రైనా అలా అమ్మాయితో చూస్తే ఇంకేమైనా ఉందా..? అని భావించిన స‌చిన్ గ‌డ్డం పెట్టుకుని, క‌ళ్ల‌కు చ‌లువ అద్దాలు ధ‌రించి అంజ‌లితో క‌లిసి సినిమాకు వెళ్లాడు. ఇంతకీ సచిన్ వెళ్ళింది ఏ సినిమాకు అనుకుంటున్నారు. మ‌ణిర‌త్నం తీసిన రోజా సినిమా. ఈ క్రమంలో థియేట‌ర్ నుంచి బ‌య‌టికి వ‌చ్చే క్ర‌మంలో ఒక్క‌సారిగా స‌చిన్ అద్దాలు కింద‌ప‌డిపోయాయి. దీంతో అత‌న్ని చూసిన చుట్టు పక్క‌ల వారు స‌చిన్ ని గుర్తుపట్టారు.

ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగ‌బ‌డ్డారు. అయితే అప్ప‌టికి ఎలాగో స‌చిన్ త‌ప్పించుకున్నాడు. కానీ వారి ల‌వ్ స్టోరీ గురించి అంత‌టా తెలిసిపోయింది. ఈ క్ర‌మంలో వారు త‌మ త‌మ ఇండ్ల‌లో కుటుంబ స‌భ్యుల‌తో చెప్పి మే 24, 1995న పెళ్లి చేసుకున్నారు. ఇంకా నెలైతే వారి పెళ్లి జ‌రిగి 25 ఏళ్లు అవుతుంది. కాగా ఈ రోజు సచిన్ తన 47 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తెలుగు అడ్డా తరుపున క్రికెట్ దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.