సినిమా కథను తలపించే బాలు-సావిత్రి గారిల ప్రేమ కథ…బంధువులు అయినప్పటికీ ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో.?

సినిమా కథను తలపించే బాలు-సావిత్రి గారిల ప్రేమ కథ…బంధువులు అయినప్పటికీ ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో.?

by Anudeep

Ads

సినిమాల్లో ప్రేమ కథలు నిజ జీవితానికి చాలా దూరంగా ఉంటాయి అని అనుకుంటాం. ఇద్దరు ప్రేమించుకోవడం తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం. అప్పుడు ఇద్దరూ కలిసి ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకోవడం. కొద్ది రోజులకి పెద్దలు వాళ్ళని అంగీకరించడం. ఇదంతా సినిమా కథ లాగా ఉంది కదా? కానీ ఒక ప్రముఖ వ్యక్తి ప్రేమకథ మాత్రం పైన చెప్పిన విధంగానే జరిగింది. ఆయన ఎవరో కాదు గాన గంధర్వుడు లెజెండరీ శ్రీ ఎస్.పి.బాలసుబ్రమణ్యం గారు.

Video Advertisement

ఎన్నో సంవత్సరాల నుండి ఆయన గాత్రంతో, హోస్టింగ్ తో, నటనతో ఇలా ఎన్నో విధాలుగా మనల్ని అలరించిన బాలుగారు, రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాల్లో ఒక వ్యక్తిగా కలిసిపోయారు. ప్రతివారికి బాలు గారిని చూస్తే మన బాలు గారు అనిపిస్తుంది. అలా ఎన్నో జనరేషన్స్ కి చేరువయ్యారు.

అందుకే ఆయన ఇంక లేరు అనే విషయాన్ని ఇప్పటికి కూడా  జీర్ణించుకోలేకపోతున్నాము. ఇప్పటికి కూడా చాలామంది రోజు బాలు గారి పాటతోనే నడుస్తుంది. ఆయన పాటలన్నీ ఇప్పుడు జ్ఞాపకాలు అయ్యాయి అని అనుకోవడానికే కష్టంగా అనిపిస్తుంది. అలా మనందరికీ చేరువైన బాలు గారు తన వ్యక్తిగత విషయాల గురించి చాలా తక్కువగా మాట్లాడారు. ఆయన వ్యక్తిగత జీవితంలో ఒక భాగమైన బాలుగారి ప్రేమ కథ ఇప్పుడు తెలుసుకుందాం.

బాలు గారిది ప్రేమ వివాహం అనే విషయం చాలా మందికి తెలియదు. బాలు గారు తన బంధువైన సావిత్రి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బంధువు అయినంత మాత్రాన వాళ్ళ ఇద్దరి ఇళ్ళల్లో కచ్చితంగా అంగీకారం తెలిపే ఉంటారు అని అనుకుంటాం. నిజానికి బాలు గారి ఇంట్లో, సావిత్రి గారి ఇంట్లో వాళ్ళ ఇద్దరి పెళ్ళికి అస్సలు ఒప్పుకోలేదు. అందుకు కారణం ఇద్దరి గోత్రాలు ఒకటే అవ్వడం. దాంతో వాళ్లు ఎంతో ఒప్పించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

సావిత్రి గారి తల్లిదండ్రులు ఆవిడని మద్రాసు నుండి బెంగళూరుకి తీసుకెళ్లిపోయారు. కానీ బాలు గారు మాత్రం ఎలాగైనా సావిత్రి గారిని పెళ్లి చేసుకొని తీరాలి అని నిర్ణయించుకున్నారు. ఒకరోజు స్నేహితుడి కారు తీసుకుని బెంగళూరు లో ఉన్న సావిత్రి గారి ఇంటికి వెళ్లారు. బాలు గారు సావిత్రి గారి తో ముందే అన్ని చెప్పడం వల్ల అప్పటికే గేటు దగ్గర సిద్ధంగా ఉన్నారు సావిత్రి గారు.

అక్కడి నుండి సావిత్రి గారు, బాలు గారు కలిసి మద్రాస్ వెళ్లిపోయారు. మద్రాసు నుండి మెయిల్ లో విశాఖపట్నానికి అక్కడి నుండి సింహాచలం కి చేరుకున్నారు. సింహాచలం నరసింహ స్వామి సమక్షంలో బాలు గారు సావిత్రి గారు పెళ్లి చేసుకున్నారు.

మూడు రోజుల తర్వాత తిరిగి మద్రాస్ కి వచ్చి ఒక హోటల్లో ఉండసాగారు. అక్కడి నుండే బాలుగారు పాటల రికార్డింగ్ లకి వెళ్లి వచ్చే వారు. కొంతకాలం తర్వాత వాళ్ళు ఉన్న హోటల్ కి ఇద్దరి తల్లిదండ్రులు వచ్చి బాలు గారిని, సావిత్రి గారిని ఆశీర్వదించారు. మొదటి సంతానం పల్లవి పుట్టేవరకూ బాలు గారి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేదట.

తర్వాత రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు సావిత్రి గారు బెంగళూరు వెళ్తున్నప్పుడు మధ్యలోనే నొప్పులు రావడంతో అరక్కోణం రైల్వే ఆసుపత్రిలో డెలివరీ అయింది. రెండో సంతానం చరణ్.

పల్లవి, చరణ్ ఇద్దరూ గాయకులే. ప్రేమికుడు సినిమా లోని అందమైన ప్రేమ రాణి పాట పాడింది పల్లవి నే. చరణ్ కూడా ఎన్నో పాటలు పాడారు, చాలా తమిళ సినిమాల్లో నటించారు, అంతే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అరణ్య కాండం సినిమాని నిర్మించారు చరణ్. ఇది ఎస్పీ బాలు, సావిత్రి గారి లవ్ స్టోరీ. వాళ్ల ప్రేమ కథ చదివితే అచ్చం సినిమాల్లో చూసే ప్రేమకథ లానే అనిపిస్తోంది కదా?


End of Article

You may also like