టాలీవుడ్ లో గోదావరి జిల్లాల నుంచే ఎక్కువ మంది డైరెక్టర్స్ ఉండడానికి కారణాలు ఇవేనా..!?

టాలీవుడ్ లో గోదావరి జిల్లాల నుంచే ఎక్కువ మంది డైరెక్టర్స్ ఉండడానికి కారణాలు ఇవేనా..!?

by Anudeep

Ads

సినిమా రంగం అనేది ఒక క్రియేటివ్ ఫీల్డ్. ఎంతమంది వారసులు వచ్చినా టాలెంట్ లేనిదే ఇక్కడ ఎవరూ  నిలదొక్కుకోలేరు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతమైంది సినిమా. అయితే కొన్ని దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీని గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వారే ఏలుతూ వచ్చారు. వాస్తవానికి ఒక ప్రాంతానికి, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేనప్పటికీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఇక్కడ ఆ రెండు జిల్లాల (తూర్పు, పశ్చిమ గోదావరి) నుంచి వచ్చిన వారే పాతుకుపోయారు.

Video Advertisement

గోదావరి జిల్లాలకి దర్శకత్వానికి లింకేంటో చూద్దాం.. తెలుగు సినిమాల్లో ప్రస్తుతం టాప్ డైరెక్టర్ల లిస్టు చూస్తే, రాజమౌళి (పశ్చిమ గోదావరి నుంచి కర్ణాటక వెళ్లి స్థిరపడ్డారు), త్రివిక్రమ్, సుకుమార్, వినాయక్, శ్రీను వైట్ల.. ఇంకా చాలా మంది యువదర్శకులు గోదావరి జిల్లాల నుండి వచ్చినవాళ్ళే.

వీళ్ళ ముందు తరం అంటే, ఈవీవీ సత్యనారాయణ, ఎస్.వీ. కృష్ణారెడ్డిల టైంలో కూడా గోదావరి జిల్లాలదే హవా. ఇక దర్శకరత్న దాసరి, బాపు ఇలా ఇంకా ఎంతోమంది గోదావరి జిల్లాలలో పుట్టినవాళ్ళే. రెండు తెలుగు రాష్ట్రాల జిల్లాలు ఒక ఎత్తు, ఆ రెండు జిల్లాలు ఇంకో ఎత్తు..

సినిమారంగంలో ముఖ్యంగా రచన దర్శకత్వం విభాగాల్లో గోదావరి జిల్లాల ఆధిపత్యం ఉండడానికి ప్రధానంగా 6 కారణాలు ఉన్నాయి.
1. వ్యవసాయంలో మిగులు ఆదాయం :
గోదావరి జిల్లాల ప్రజలు దేవుడిలా కొలిచే సర్ ఆర్థర్ కాటన్, ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించడం ద్వారా గోదావరి జిల్లాల రూపురేఖల్ని మార్చివేసారు. సాగునీటికి కొరత లేకపోవడంతో గోదావరి జిల్లాల రైతులు ఏడాదికి రెండు మూడు పంటలు పండిస్తూ ఆర్థికంగా మిగులు సాధించారు. ఎప్పుడైతే వ్యవసాయ రంగంలో మిగులు ఆదాయం వచ్చిందో అప్పుడు పిల్లల చదువులు, కళల మీద ప్రజలు దృష్టి పెట్టారు.
2. విద్యావ్యాప్తి:
మనదేశానికి స్వాతంత్య్రం రాకముందే గోదావరి జిల్లాలు వ్యవసాయం, విద్య, కళల విషయాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించాయి. ఇప్పట్లోలా చదువంటే ఇంజనీరింగ్ ఒక్కటే కాదు కాబట్టి, విద్యార్థులు తెలుగు సాహిత్యం బాగా చదువుకునేవారు. గ్రంధాలయాలలో లభించే వందలాది పుస్తకాలు చదవడం వల్ల, ఆ జ్ఞానం గోదావరి జిల్లాల వారికి సినిమా రంగంలో మాటలు, పాటల రచయితలుగా, దర్శకులుగా ఎదగడానికి ఉపయోగపడింది.
3. మద్రాసుకి రైలు, రోడ్డు మార్గాలు:
1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత, బ్రిటిష్ వాళ్ళు తమ సైన్యం కదలికల కోసం ఏర్పరచుకున్న కలకత్తా- మద్రాస్ గ్రాండ్ ట్రంక్ రోడ్, కలకత్తా- మద్రాస్ రైల్వే లైన్ వల్ల, గోదావరి జిల్లాలకే కాదు, మొత్తం కోస్తా ఆంధ్రకి మద్రాస్ దగ్గర అయింది. అప్పట్లో సినిమా ఇండస్ట్రీ అంతా మద్రాస్ లోనే ఉండేది. సినిమాలలో ఛాన్స్ కోసం ప్రయత్నించేవాళ్ళు రైలెక్కి మద్రాస్ లో దిగిపోయేవాళ్ళు. మద్రాస్ వెళ్ళడం అనేది ఈజీ కావడం కూడా గోదావరి జిల్లాలకి ప్లస్ అయింది.
4. షూటింగ్స్ ఎక్కువగా జరగడం:
అందమైన పల్లెటూళ్ళు, కొబ్బరి చెట్లు, కాలువలు, గోదావరి, సముద్రం, నర్సరీలు ఇవన్నీ సినిమా షూటింగ్ లకి గోదావరి జిల్లాలని కేరాఫ్ అడ్రస్ గా మార్చాయి. తమ కళ్ళెదురుగా సినిమా షూటింగ్ లు చూస్తున్న జనానికి సహజంగా సినిమాల మీద ఆసక్తి కలుగుతుంది. సినిమా వాళ్ళకి జనం లో ఉండే క్రేజ్ చూసినప్పుడు సినిమాల్లోకి వెళ్ళాలనే ఆసక్తి మరింత పెరుగుతుంది.
5. దాసరి అనే మహావృక్షం:
దర్శకరత్న దాసరి నారాయణ రావు గారిది ప.గో జిల్లా పాలకొల్లు. ఇండస్ట్రీలో అందరూ గురువు గారు అని పిలుచుకునే దాసరికి శిష్యులు ఎక్కువ. స్థానికంగా ఉండే పరిచయాల కారణంగా ఆయన శిష్యులలో ఎక్కువమంది గోదావరి జిల్లాల వాళ్ళే ఉన్నారు. సినిమా రంగం లో దాసరి అనే మహావృక్షం అనేక మంది సినిమా పక్షులకి గూడుగా ఉపయోగపడింది.
6. ఇండస్ట్రీలో పరిచయాలు:
సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కి తరలి వచ్చాక, గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చేవారికి ఇండస్ట్రీలో అప్పటికే స్థిరపడిన గోదావరి జిల్లాల వారి రిఫరెన్స్ లు ఉపయోగపడ్డాయి. సినిమా ఇండస్ట్రీలో అప్పటికే వందలాది మంది ఈ జిల్లాల వారు విజయం సాధించడం వల్ల ఈ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించే వారికి, తమ కుటుంబం నుంచి కూడా సపోర్ట్ ఉండేది.
ఇప్పుడిప్పుడే కాస్త గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం కాకుండా ఇతర జిల్లాలనుంచి కూడా దర్శకులు వస్తున్నారు.


End of Article

You may also like