Ads
మాయాబజార్, గుండమ్మ కథ సినిమాలు తెలుగు సినిమా చరిత్రపై చెరగని గుర్తును వేసాయి. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ.. అవి ఎవర్ గ్రీన్ చిత్రాలు. అయితే ఆ సినిమాలను నిర్మించినది విజయ వాహినీ స్టూడియోస్ అన్నది అందరికి తెలిసిందే. విజయా వారి సినిమాల ప్రారంభంలో ‘క్రియా సిద్ధి, సత్వే భవతి’ అని దేవనాగరి లిపిలోని అక్షరాలు… మధ్యలో గదతో ఆంజనేయుడు ఉన్న పతాకం రెపరెపలాడడం చాలామందికి గుర్తుండే ఉంటుంది. ‘మహాత్ముల కార్యసిద్ధి వారి స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది’ అని ఆ మాటకు అర్థం. ఆ నినాదాన్ని నమ్ముకున్నారు ఆ ప్రొడక్షన్ నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి.
Video Advertisement
దిగ్గజ నిర్మాతలైన నాగిరెడ్డి, చక్రపాణి విజయ బ్యానేర్ పై అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. 1950లో షావుకారు సినిమాతో మొదలుపెట్టిన ఈ బ్యానర్… 1994లో సింగీతం శ్రీనివాసరావు, బాలకృష్ణల భైరవద్వీపం వరకూ ఎన్నో అద్భుతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. విజయా ప్రొడక్షన్స్ తీసిన ఆనాటి క్లాసిక్స్ అన్నీ విజయ వాహినీ స్టూడియోస్‌లోనే తెరకెక్కాయి. ఆ తర్వాత చిత్రాలను తీయడం కాస్త తగ్గించింది ఈ సంస్థ. తమిళంలోఈ బ్యానర్ మీద 2019 వరకూ కొత్త తరం కథానాయకులతో కూడా సినిమాలు తీశారు.
తెలుగు నిర్మాత మూలా నారాయణ స్వామి ప్రారంభించిన వాహిని స్టూడియోని విజయా ప్రొడక్షన్స్ అధినేతలు బి.నాగిరెడ్డి, చక్రపాణిలు 1948లో తీసుకున్నారు. అలా ఆ రెండు సంస్థలు కలిపి దక్షిణాసియాలోనే అతిపెద్ద స్టూడియోగా చెప్పే విజయ వాహిని స్టూడియోస్‌గా మారింది. విజయ వాహిని స్టూడియోలో ఒకేసారి 12 సినిమాల షూటింగ్ చేసుకోగలిగినంత ఎక్విప్మెంట్, కెమెరాలు, సౌండ్ సిస్టమ్స్ ఉండేవని నాగిరెడ్డి కుమారుడు బొమ్మిరెడ్డి విశ్వనాథరెడ్డి తెలిపారు.
వాహిని స్టూడియోస్ పక్కనే ఉన్న రేవతి స్టూడియో అధినేతలు దానిని నిర్వహించలేక ఆ స్టూడియోను కూడా బీఎన్‌రెడ్డికి అప్పగించారని విశ్వనాథ రెడ్డి తెలిపారు. ” వాహిని స్టూడియోస్ ప్రారంభించినపుడు ఒక ఫ్లోర్ మాత్రమే ఉండేది. వాహిని స్టూడియోస్‌ను మా పెదనాన్న నరసింహా రెడ్డి తీసుకున్నారు. అది రన్నింగ్‌లోకి వచ్చేటప్పటికి కొన్ని సమస్యల వల్ల మా నాన్న చేతికి వచ్చింది. ఆ తర్వాత దానిలో ఫ్లోర్లు పెంచారు. అందులో మొత్తం 14 ఫ్లోర్లు ఉండేవి.విజయ వాహిని స్టూడియో మద్రాస్‌కు ల్యాండ్ మార్క్‌గా ఉండేది. నాగిరెడ్డి, చక్రపాణిలతోపాటూ కేవీ రెడ్డి, ఎల్వి ప్రసాద్ అందరూ ఒక జట్టుగా ఏర్పడి విజయ వాహినీ బ్యానర్ మీద సినిమాలు చేసేవారు. ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు, సావిత్రి, పద్మనాభం లాంటి ఎంతోమంది నటులు నెలవారీ వేతనాలు తీసుకుంటూ పనిచేసేవారు.” అని విశ్వనాథ రెడ్డి వివరించారు.
సినీ పరిశ్రమ హైదరాబాద్ కు తరలినపుడు హైదరాబాద్‌కు వచ్చి స్టూడియో నిర్మించాలని నాగిరెడ్డిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. కానీ ఆయన చెన్నై ని విడిచి రావడానికి ఒప్పుకోలేదట. పరిశ్రమ మొత్తం హైదరాబాద్‌కు తరలి వెళ్లిన తర్వాత స్టూడియో ముందున్న 5 ఎకరాలు తీసుకొని అందులో హాస్పిటల్ పెట్టారు. ఇక్కడ 40పడకలతో ఒక ఆస్పత్రి ప్రారంభించారు. ఇప్పుడు అది 700పడకల ఆస్పత్రిగా మారింది. 1972లో ఆస్పత్రి ప్రారంభమయ్యింది. 1974లో దానిని చారిటబుల్ ట్రస్ట్ కింద మార్చి, నో ప్రాఫిట్ కింద డెవలప్ చేశారు.
ఎంతో చరిత్రతో పాటూ, సినీ రంగంలో ఎంతోమంది అడుగుజాడలకు గుర్తుగా మిగిలిన విజయా సంస్థపై మళ్లీ సినిమాలు చేయాలనే కోరిక ఉందన్నారు విశ్వనాథరెడ్డి. కానీ తనకు కుదరలేదని, తమ తర్వాత తరం వారు అయినా చేస్తారని ఆకాక్షిస్తున్నానని ఆయన తెలిపారు. మా కుటుంబంలో ఎవరో ఒకరు విజయ వాహినీ బ్యానర్ స్టార్ట్ చేయాలనీ ఆశిస్తున్నాను అని ఆయన వెల్లడించారు. విజయ వాళ్ళు మంచి సినిమాలు తీశారు. ఆ స్ఫూర్తితో ఎవరో ఒకరు అడుగు ముందుకు వేస్తే బావుంటుంది అని విశ్వనాథరెడ్డి తెలిపారు.
watch video :
End of Article