తెలుగు సినిమా పుట్టి ఏడు దశాబ్దాలు అవుతోంది. ఏడు దశాబ్దాలలో ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు. కొందరు కనుమరుగపోయారు. మరి కొందరు ఇండస్ట్రీ లో తమ పేరుని సుస్థిరం చేసుకున్నారు. వారిలో ఒకరే ‘సురభి కమలాబాయి’. తెలుగు సినిమా పరిశ్రమలో ఆమె మొదటి హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతులు సాధించారు.
Video Advertisement
1908వ సంవత్సరంలో సురభి నాటక సంస్థ గుంటూరులో నాటక ప్రదర్శనలు చేస్తున్న సమయంలో ఒక నటికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆ నాటక వేదిక మీద ఆ మహిళ ఓ ఆడబిడ్డకు ప్రసవించింది. ఆ బిడ్డ ఎవరో కాదు కమలాబాయి. తెలుగు సినిమా పరిశ్రమలో ఆమె మొట్టమొదటి హీరోయిన్‌గా రికార్డులకు ఎక్కింది.
బాల్యంలో కృష్ణుని, ప్రహ్లాదుని పాత్రలు వేస్తుండేవారు. 1931లో హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన తొలి తెలుగు టాకీ చిత్రము భక్తప్రహ్లాద లో లీలావతి పాత్ర ధరించింది. ‘పాదుకా పట్టాభిషేకం’లో సీతగా సాగర్ ఫిలింస్ రూపొందించిన ‘శకుంతల’లో శకుంతలగా నటించారు. బి.వి.రామానందం దర్శకత్వంలో కృష్ణా ఫిలింస్ నిర్మించిన ‘సావిత్రి’లో సావిత్రిగా టైటిల్ రోల్ పోషించారు.
ఆమెకు సహజనటిగా పేరు ఉండేది. ఆమె నటనతో పాటు నాట్యకళలో కూడా రాణించింది. సినిమా రంగంలో ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న కమలాబాయి హీరోయిన్ గానూ అటు మధురమైన గాత్రంతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. అప్పట్లో తన పాత్రకు తానే పాటలు, పద్యాలూ పాడేవారు కమలాబాయి.
పాతాళభైరవి సినిమాలో తోట రాముడికి తల్లి పాత్రలో, అలాగే 1953లో వచ్చిన అమ్మలక్కలు సినిమాలో కూడా కీలక పాత్రలో నటించింది. కమలాబాయి తెలుగుతో పాటు హిందీలో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. అన్నేళ్లపాటు హీరోయిన్ గా నటించినా చివరకు మాత్రం అప్పటి తరం నటులు చాలా మందిలాగే ఆర్ధిక ఇబ్బందులుపడి 1971, మార్చి 30న మరణించింది.
ఆమె చివరి రోజుల్లో ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న సీనియర్ ఎన్టీఆర్ ఆమెకు అండగా నిలబడ్డారు అని కొందరు చెబుతారు. అయితే ఈమె కుటుంబం గురించిన వివరాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు బయటికి రాలేదు. అంత గొప్ప నటి, చివరి రోజుల్లో సరైన గుర్తింపు లేక ఇబ్బదులు పడటం బాధాకరం.