ఆర్ఆర్ఆర్ చిత్రానికి బిగ్ షాక్ తగిలింది. ఆస్కార్ బరిలోకి వెళ్లి అదరగొడుతుందన్న సినిమాకు భారత ప్రభుత్వం నుంచి చుక్కెదురైంది. ఇంటర్నేషల్ మీడియా మొదలుకుని.. నేషనల్ మీడియా వరకు వచ్చిన న్యూస్ తాజాగా అబద్దమైంది. అందరూ అనుకున్న ట్రిపుల్ ఆర్ చిత్రానికి బదులు.. ఓ గుజరాతీ మూవీ ఆస్కార్ కు వెళ్లనుంది.
Video Advertisement
దర్శకుడు పాన్ నలిన్ సినిమా ‘ఛెల్లో షో’ భారత్ నుంచి ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. ఇది గుజరాతీ చిత్రం. 95వ ఎడిషన్ ఆస్కార్ అవార్డుల కోసం అధికారికంగా భారత్ నుంచి ఈ సినిమాను నామినేట్ చేశారు. ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరీలో ఈ సినిమా నామినేట్ అయింది.
భారత సినిమా సమాఖ్య కార్యదర్శి సుపర్ణా సేన్ ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ కన్నడ దర్శకుడు టీఎస్ నాగాభరణ నేతృత్వంలోని జ్యూరీ, ఆస్కార్ నామినేషన్ కోసం ‘ఛెల్లో షో’ చిత్రాన్ని ఎంపిక చేసింది. న్యూయార్క్‌లోని ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ఛెల్లో షో’ వరల్డ్ ప్రీమియర్ షోను ప్రదర్శించారు. భారత్‌లో ఈ సినిమా అక్టోబర్ 14న విడుదల కానుంది.
ఇండియా తరుపున ఆస్కార్ బరిలో ట్రిపుల్ ఆర్ తో పాటు.. కాశ్మీరీ ఫైల్స్ చిత్రం కూడా వెళుతుందని అందరూ అనుకున్నారు. కాని ఊహించని విధంగా.. గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’ తెరపైకి వచ్చి అందర్నీ షాక్ చేసింది. ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది.
ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ రాయ్ కపూర్ బ్యానర్ రాయ్ కపూర్ ఫిల్మ్స్, జుగాద్ మోషన్ పిక్చర్స్, మాన్సూన్ ఫిల్మ్స్ నిర్మించారు. ఇందులో మార్క్ డ్యూలే. భవిన్ రాబరి, భవేష్ శ్రీమాలి, రిచా మీనా, దిపెన్ రావల్, పరేష్ మెహతా ప్రధాన పాత్రలలో నటించారు. గతేడాది జూన్‌లో జరిగిన ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రారంభ సినిమాగా ఈ మూవీ ప్రపంచ ప్రీమియర్ ప్రదర్శించారు.
సినిమా డైరెక్టర్ నలిన్ ప్రకారం, ఈ సినిమా ఒక ‘సెమీ-ఆటోబయోగ్రఫికల్’ చిత్రం. అంటే ఈ చిత్రాన్ని కొంతవరకు తన జీవిత కథ ఆధారంగా తీశారు. గుజరాత్ గ్రామీణ ప్రాంతంలో చిన్నతనంలో సినిమాల పట్ల ఆకర్షితుడైన నళిన్ జ్ఞాపకాల ఆధారంగా ఈమూవీని తెరకెక్కించారు. స్పెయిన్‌లోని 66వ వల్లాడోలిడ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ స్పైక్‌తో సహా ఫెస్టివల్ రన్ సమయంలో ఈ సినిమా అనేక అవార్డులను గెలుచుకుంది. ఇక్కడ థియేటర్ రన్ సమయంలో కమర్షియల్ హిట్ అందుకుంది.
పాన్ నలిన్‌కు ‘అవార్డ్ విన్నింగ్’ సినిమాల దర్శకుడు అనే పేరు ఉంది. ఆయన సంసార, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, యాంగ్రీ ఇండియన్ గాడెస్, ఆయుర్వేద: ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అనే సినిమాలను తీశారు. సినిమా తీయడంలో పాన్ నలిన్ ఎలాంటి శిక్షణ పొందలేదు. అహ్మదాబాద్‌లోని నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో ఆయన చదివారు.
ఈ నిర్ణయం తో ఫిలిం ఫెడరేషన్ అఫ్ ఇండియా పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ ‘ చాలా విచిత్రమైన సంస్థ. 2013లో చాలామంది విదేశీ విమర్శకులు కూడా భారత్ నుంచి ‘లంచ్ బాక్స్’ సినిమాను ఆస్కార్‌కు నామినేట్ చేయాలని తమ అభిప్రాయాన్ని చెప్పారు. కానీ, అప్పుడు ‘లంచ్ బాక్స్’ సినిమాను ఆస్కార్ కోసం నామినేట్ చేయలేదు. అలాగే విదేశాల్లో బాగా ఆదరణ పొందిన ‘ది డిసైపుల్’ అనే సినిమాను కూడా విస్మరించారు. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారు” అని జర్నలిస్ట్ అసీమ్ ఛాబ్రా ట్విట్టర్‌లో అన్నారు.
తన సినిమాను అధికారికంగా ఆస్కార్ అవార్డు కోసం పంపడంతో పాన్ నలిన్ ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు.
”భారత సినిమా సమాఖ్యకు, జ్యూరీకి కృతజ్ఞతలు. ‘ఛెల్లో షో’ సినిమాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. సినిమా వినోదాన్ని పంచడంతో పాటు ప్రేరణగా నిలుస్తుందని నేను నమ్ముతున్నా” అని ఆయన ట్వీట్ చేశారు.