మనం దర్శనం కోసం ఏ శివాలయంకి వెళ్ళినా సరే మనకు అక్కడ నంది కనబడుతుంది. అలానే గర్భగుడిలో శివుడు ఉంటాడు. నంది దగ్గరికి వెళ్లి నంది రెండు కొమ్ముల మధ్యలో నుంచి శివలింగాన్ని చూడాలని పెద్దలు అంటూ ఉంటారు. అయితే ఎప్పుడైనా నంది లేని శివలింగాన్ని చూసారా..? సహజంగా నంది లేకుండా శివలింగం ఉండదు కదా..? శివలింగం మాత్రమే ఉండి నంది లేని ఆలయం కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారా..?
అవునండి నంది లేని శివాలయం కూడా ఉంది. ఆ ఆలయమే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం. 12 జ్యోతిర్లింగాలలో ఇది కూడా ఒకటి. అయితే ఈ ఆలయంలో మాత్రం శివలింగానికి ఎదురుగా నంది కనపడదు. దీనికి గల కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
భారతదేశంపై దండెత్తి ఔరంగజేబ్ భారతదేశంలో ఉన్న ఎన్నో ఆలయాలను కూల్చివేశారు. అదే విధంగా ఔరంగజేబ్ మరియు అతని సైన్యం కాశీ విశ్వేశ్వర ఆలయం మీద దండయాత్ర చేశారు. ఈ ఆలయాన్ని కూల్చివేయడానికి ఔరంగజేబ్ మరియు అతని సైన్యం రాగా.. అక్కడ ఉండే అర్చకుడు వెంటనే అక్కడ ఉన్న శివలింగాన్ని తీసుకువెళ్లి నూతిలో విసిరేస్తారు.
అప్పటి వరకు అయితే శివలింగానికి ఎదురుగా నంది ఉండేది. ఔరంగజేబ్ మరియు అతని సైన్యం ఆలయానికి వచ్చి సగం ఆలయాన్ని మొత్తం కూల్చివేశారు. వీళ్ళు వెళ్లిపోయిన తర్వాత అర్చకుడు ఆ శివలింగాన్ని బావిలోంచి తీద్దామని చూస్తే శివ లింగం రాలేదు.
ఎంత ప్రయత్నించినా దొరకక పొయేసరికి మరో శివలింగాన్ని తయారుచేసి కొత్తగా ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్టించారు. ఈ శివ లింగం ముందు నంది లేదు అయితే పాత ఆలయంలో ఉన్న నందిని పూజిస్తారు. అలానే బావిలో శివలింగం ఉందని భావించి ఆ బావికి కూడా పూజలు చేస్తారు.