Ads
స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పై నిర్మించిన ఈ చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం వహించారు. నవంబర్ 11 న విడుదలైన ఈ చిత్రం డీసెంట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీ లో విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Video Advertisement
డిసెంబర్ రెండో వారం లో ఈ చిత్రం ఓటీటీ లోకి రానుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ లోపే యశోద మేకర్స్ కి ఊహించని దెబ్బ తగిలింది. యశోద సినిమా ఓటీటీ విడుదలపై స్టే విధిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
తమ హాస్పిటల్ విశ్వసనీయతకు భంగం కలిగేలా యశోద సినిమాను చిత్రీకరించారని పేర్కొంటూ ఇవా ఐవీఎఫ్ ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యం పిటిషన్ దాఖలు చేసింది. సినిమాలో తమ హాస్పిటల్ పేరును చూపించారని.. దీనివల్ల తమ ప్రతిష్ఠకు భంగం కలిగిందని హాస్పిటల్ యాజమాన్యం పేర్కొంది. వాదనలు నమోదు చేసుకున్న కోర్టు.. డిసెంబర్ 19 వరకు సినిమాను ఓటీటీలో విడుదల చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు సినిమా నిర్మాతలకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 19 న ఉంటుందని పేర్కొంది.
అయితే సినిమా విడుదలై ఇన్ని రోజులు అయినా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయని సదరు ఆస్పత్రి యాజమాన్యం.. ఇప్పుడు పిటిషన్ వెయ్యడం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సినిమా ట్రైలర్ మొదలు అన్నిటిలోను ఈ విషయాలను స్పష్టంగా చెప్పింది మూవీ యూనిట్. కానీ అప్పుడెందుకు వారు అడ్డుకోలేదని ప్రశ్నిస్తున్నారు. మరి కోర్ట్ తదుపరి విచారణ తర్వాత ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.
End of Article