Ads
సమాజంలో నాస్తికులతో పాటు ఆస్తికులు కూడా ఉంటారు. దేవునిపై ఎటువంటి నమ్మకం లేని వారిని నాస్తికులు అని పిలిస్తే.. నమ్మకం కలిగిన వారిని ఆస్తికులు అని అంటాం. అయితే.. వీరందరికీ అతీతంగా సన్యాసులు తమ ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటారు. వారు సర్వసంగ పరిత్యాగులు. దైవారాధన తప్ప తక్కిన విషయాలను పట్టించుకోరు.
Video Advertisement
అయితే.. ఒక ట్రైన్ లో నాస్తికురాలు అయిన ఓ అమ్మాయికి తన ఎదురు సీట్ లో ఓ సన్యాసి కనిపిస్తాడు. కాలక్షేపం కోసం మొదలు పెట్టి అతనితో ఎగతాళిగా మాట్లాడుతుంది. తనకు దేవుడు ఉన్నాడో లేదో తెలియాలి అని అడుగుతుంది.
అయితే.. ఆ సన్యాసి ఒక సారి ఆమె వైపు చూసి ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఆ సన్యాసి ఏమీ మాట్లాడక పోవడంతో ఆమె మరోసారి రెట్టించి అడుగుతుంది. నాకు దేవుడి చిరునామా ఎక్కడ ఉందొ తెలుసుకోవాలని ఉంది అంటూ మరోసారి ప్రశ్నిస్తుంది. దీనితో ఆ సన్యాసి చిరునవ్వుతో బదులిస్తాడు. నీకు ఓ కథ చెబుతాను.. బహుశా ఆ కథలో నీకు సమాధానం దొరకవచ్చు అని చెబుతాడు.
పూర్వం ఓ ఊళ్ళో ఓ కుటుంబంలో తల్లి తండ్రులు తమ కూతురుకి పెళ్లి చేయాలనీ అనుకుంటారు. తమ ఇంటి పక్కన ఉండే వారి కుమారుడు తమ కుమార్తెకి అన్ని విధాలా తగిన వాడని భావిస్తారు. అయితే.. అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి ఒప్పుకోదు. ఊళ్ళో అందరికంటే గొప్పవారు ఎవరైతే ఉంటారో.. ఆయననే పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయి మొండికేస్తుంది. ఊళ్ళో కాదు.. ఈ రాజ్యంలోనే అందరికంటే గొప్పవారు రాజు గారు అని ఆమెకు తెలుస్తుంది. వెంటనే రాజుగారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఇంట్లో తల్లి తండ్రులు ఎంత చెప్పినా వినిపించుకోదు.
తీరా రాజుగారి దగ్గరకు వెళ్లి తనను పెళ్లి చేసుకోమని అడగాలని అనుకుంటుంది. అంతలోనే రాజుగారు దారిన పోయే ఓ సన్యాసికి నమస్కారం పెట్టడం చూస్తుంది. ఆ సన్యాసే రాజుగారి కంటే గొప్ప అని భావించి ఆయనని పెళ్లి చేసుకోమని అడగాలని అనుకుంటుంది. ఆయన వద్దకు వెళ్ళేలోపు ఆయన పక్కన ఉన్న వినాయక విగ్రహానికి దణ్ణం పెట్టుకుంటూ ఉంటాడు. అయితే విగ్రహాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అంతలోనే ఓ కుక్క వచ్చి విగ్రహం కింద కాలు లేపి మూత్ర విసర్జన చేసేస్తుంది. దీనితో విగ్రహం కంటే ఆ కుక్కే శ్రేష్టమైనదని ఆ అమ్మాయి విశ్వసిస్తుంది.
ఆ కుక్క వెనకాలే పరిగెడుతుంది. అంతలోనే ఓ పిల్లవాడు ఆ కుక్కని ఓ రాయి పెట్టి కొట్టగానే కుక్క పారిపోతుంది. దీనితో.. ఆ పిల్లవాడు అందరికంటే గొప్ప అని ఆ అమ్మాయి అనుకుంటుంది. ఆ పిల్లవాడిని పెళ్లి చేసుకోమని అడుగుదామనుకుంటుంది. అంతలోనే ఓ యువకుడు వచ్చి ఆ పిల్లవాడి చెవి మెలితిప్పి కుక్కని ఎందుకు కొట్టావు అని అడుగుతాడు. దీనితో ఆ పిల్లవాడిని మందలించిన యువకుడే గొప్పవాడు అని ఆమె భావించి, అతనినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. తన తల్లి తండ్రులకు కూడా వెళ్లి చెబుతుంది. ఇంతకీ ఆ యువకుడు ఎవరో కాదు. వారి ఇంటి పక్కన నివసించే వారి కుమారుడే. ఈ కథ అంతా చెప్పాక ఆ సన్యాసి ఇలా వివరిస్తాడు. ఈ కథలో అమ్మాయిలాగానే మనం దేవుడి కోసం ఎక్కడెక్కడో వెతుకుతాము. కానీ, ఆయన మన హృదయాంతరాల్లోనే ఉన్నాడని తెలుస్తుంది. అక్కడ మాత్రమే మనం ఆయన్ను చూడగలం అని చెబుతాడు. అదే దేవుని చిరునామా అని చెబుతాడు.
End of Article