Ads
“దేశ భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణ దేవరాయల వారు ఏనాడో సెలవిచ్చారు. తెలుగు భాషలో ఉన్నంత తీయదనం, పదప్రయోగాలు, అలంకార ప్రయోగాలు.. ఇతర భాషలలో కానరావు. నేర్చుకోవడానికి సులువైన భాష.. ఎంతో చమత్కారంగా వాడుకకు ఉపయోగపడే భాషలలో తెలుగు భాష ముందు వరసలో ఉంటుంది. మన తెలుగు భాష ఔన్నత్యాన్ని స్మరించుకోవడానికి ఓ ప్రత్యేక రోజుని కూడా కేటాయించారు.
Video Advertisement
గిడుగు రామ మూర్తి జయంతి అయిన ఆగష్టు 29 న తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే ఎందుకు జరుపుకుంటారు? అసలు గిడుగు రామ మూర్తి ఎవరు..? అన్న విషయాలు చాలా మందికి తెలియకపోవడం దురదృష్టకరం. ఇంతకూ.. ఈయన ఎవరో… ఆయన జయంతి రోజునే ఎందుకు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు భాష ఒకప్పుడు గ్రాంథికంలో ఉండేది. సంగీతం, నాటకం, వ్యాకరణం వంటి అంశాలలోనే ఎక్కువగా వాడుకకు అనువుగా ఉండేది. ఒకప్పుడు బాగా చదువుకున్న వారు, పండితులు మాత్రమే గ్రాంథికంలో ఉన్న గ్రంధాలను అర్ధం చేసుకోగలిగేవారు. అప్పట్లో రచించబడ్డ గ్రంధాలు, శాసనాలు అన్ని గ్రాంథికంలోనే రచించబడి ఉండేవి. వీటిని అర్ధం చేసుకోవడం సామాన్యుల తరం కాదు. అయితే.. తెలుగు భాష అందరికి అర్ధమయ్యేలా సరళీకృతం చేయడంలో ప్రముఖ భాషావేత్త, చరిత్రకారుడు అయిన గిడుగు రామ మూర్తి కీలకంగా కృషి చేసారు.
ఆయన కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన జన్మదినమైన ఆగస్టు 29ని మనం ‘తెలుగు భాషా దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. గిడుగు రామ మూర్తి శ్రీకాకుళంలో పుట్టి పెరిగారు. తండ్రి మరణించిన తరువాత జీవితంలో నిలదొక్కుకోవడం కోసం ఆయన చాలా కష్ట పడాల్సి వచ్చింది. ఆయన తన చెల్లి కుటుంబం సాయంతో మెట్రిక్యులేషన్ చదువు పూర్తి చేసి గజపతి మహారాజా పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరారు. దాదాపు 55 సంవత్సరాల పాటు ఆయన అక్కడే పని చేసారు.
అయితే.. ఆ సమయంలోనే ఆయన తెలుగు భాష ఎంత కఠినంగా ఉందో అర్ధం చేసుకున్నారు. స్వతహాగా భాషావేత్త అయినప్పటికీ.. చాలా గ్రంధాలలోని అంతరార్ధాన్ని అర్ధం చేసుకోలేకపోవడాన్ని గమనించారు. అందుకే పాత కాలంనాటి గ్రంధాలన్నీ కేవలం పండితులకే కాకుండా.. సామాన్య ప్రజానీకానికి కూడా అర్ధం అయ్యేలా ఉండాలని తపన పడ్డారు. ఇందుకోసం ఏకంగా ఓ ఉద్యమాన్నే చేపట్టారు. భాషలో స్పష్టత పెరగడం కోసం ఆయన అనేక ఇతర భాషలను కూడా అధ్యయనం చేసారు. అప్పటి కాలంలో తెలుగు వచనంలో కాకుండా పద్య రూపంలో ఉండేది. అయితే.. తెలుగు భాష అందరికి అర్ధమయ్యేలా వచన రూపంలో ఉండాలని ఆయన కృషి చేసారు. తన పాయింట్ ని అందరికి అర్ధం అయ్యేలా చెప్పడం కోసం స్వయంగా “తెలుగు” అనే దినపత్రికని కూడా ప్రారంభించారు.
ఈ క్రమంలో ఇతర గిరిజన భాషలపై కూడా ఆయన దృష్టి సారించారు. సవర భాష కోసం కూడా ఆయన ఎంతో కష్ట పడ్డారు. ఈ భాషని అధ్యయనం చేసే క్రమంలో అడవులలో తిరిగేవారు. ఈ సమయాల్లోనే క్వినైన్ ను ఎక్కువగా ఉపయోగించే ప్రదేశాల్లో తిరగడం వలన ఆయనకు చెవుడు వచ్చింది. అయినప్పటికీ ఆయన తన ప్రయత్నాలను ఆపలేదు. సవర భాషకు లిపి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. తెలుగు, సవర భాషల కోసం ఆయన చేసిన కృషికి ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు ‘రావు సాహెబ్’ బిరుదునిచ్చింది. 1933 వ సంవత్సరంలో కైసర్-ఇ-హింద్ పతకాన్ని కూడా ప్రదానం చేసింది. కేవలం తెలుగుకు మాత్రమే కాకుండా.. ఇతర గిరిజన భాషల మనుగడకి కూడా గిడుగు రామ మూర్తి ఎంతగానో కృషి చేసారు.
End of Article