Ads
ద్వారక.. ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి. కృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది? సముద్రంలో ఎందుకు మునిగిపోయింది?.
Video Advertisement
ద్వారకా అనేక ద్వారాలు కలది అని అర్థం. ద్వార్ అనే పదానికి సంస్కృత భాషలో వాకిలి, ద్వారం అనే అర్థాలున్నాయి. ద్వార్ ఆధారంగానే ఈ నగరానికి ద్వారక పేరు వచ్చిందని చెబుతారు. అనేక ద్వారాలు ఉన్న నగరం కాబట్టి ద్వారక అయింది. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ ధామ్ (నాలుగు ధామాలు)లలో ద్వారకాపురి ఒకటి. ఆ మిగిలిన మూడు పవిత్ర నగరాలు.. బద్రీనాథ్, పూరీ, రామేశ్వరం.
వేద వ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు. ఈ నగరం గుజరాత్‌లోని పశ్చిమ తీరంలో ఉంది. శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు. దీంతో మగధరాజైన జరాసంధుడు మధురపై అనేక దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకకు తరలించాడు. అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు.
ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. అంధకులు, వృష్టులు, భోజులు ఇందులో భాగస్వాములు. ద్వారకను పాలించిన యాదవులను ‘దశరాస్’ అంటారు. వాసుదేవ కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు.. ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు.
మహాభారత యుద్ధం క్రీ.పూ. 3138లో జరిగింది. ఆ తర్వాత 36 ఏళ్లు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు. కృష్ణుడి అనంతరం యాదవ రాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల సామ్రాజ్యం పతనైమనట్లు చెబుతారు. శ్రీకృష్ణుడు 120 ఏళ్లు జీవించినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం వచ్చిందట. ఆ సునామే ద్వారకను ముంచెత్తిందని చెబుతారు. సాగరం ఉవ్వెత్తున ఎగసి వస్తుంటే తాను చూశానని మహాభారతంలో అర్జునుడు కూడా చెబుతాడు.
ద్వారకాపురి క్రీ.పూ. 1443లో సాగర గర్భంలో మునిపోయినట్లు చెబుతారు. తీరం వెంట దీని ఆనవాళ్లు లభించాయి. ప్రస్తుతం గుజరాత్‌లోని జామ్‌నగర్ సముద్రతీరంలో ద్వారకకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ద్వారకాధీశుడి ఆలయం కూడా చాలా ప్రసిద్ధి. దీన్ని శ్రీకృష్ణుడి మనవడు వజ్రనాభుడు నిర్మించాడని ప్రతీతి.
డాక్టర్ రావు బృందం 2001 నుంచి 2004 వరకు ద్వారకా నగరంపై పరిశోధనలు చేసింది. 2001లో సముద్రజలాల్లో మునిగి ఉన్న కొన్ని కళాఖండాలను వెలుగులోకి తెచ్చారు. తదుపరి పరిశోధనల కోసం రూ. 14 కోట్లు ఖర్చవుతాయని, వాటిని విడుదల చేయాలని నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి ఎస్.ఆర్. రావు ఓ లేఖ రాశారు. కానీ, యూపీఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఇది అక్కడే ఆగిపోయింది.
మహాభారతం, రామాయణం పుక్కిటి పురాణాలు కాదని, వాటికి చారిత్రక ఆధారాలు ఉన్నాయని అనేక పరిశోధనల్లో బయటపడింది. అలాంటి ఒక పరిశోధనలోనే వసుదేవ కృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం గురించి వెలుగులోకి వచ్చింది. 1983-86లో గుజరాత్ సముద్రతీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయం బయటపడింది. పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగరానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి.
ప్రముఖ ఆర్కియాలజిస్టు డాక్టర్ ఎస్.ఆర్. రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధన శ్రీకృష్ణుడి ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ మహా నగరం క్రీ.పూ. 3150 ఏళ్ల కిందటిదని నిర్ధారించారు. అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు. గుజరాత్ తీరం నుంచి 20 కి.మీ. దూరంలో సముద్ర గర్భంలో 40 మీ. లోతులో సుమారు 9 చ.కి.మీ. వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫొటోలను బాహ్య ప్రపంచానికి విడుదల చేశారు.
సాగర గర్భంలో పురాతన నగరం అవశేషాలు అనేకం బయటపడ్దాయి. రాతి దిమ్మెలు, స్తంభాలు నీటిపారుదల పరికరాలు మొదలైనవి. అయితే ఇవి ఏ కాలానికి చెందినవన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలీదు. చర్చలు జరుగుతున్నాయి. వాటిని పరిశోధనల కోసం విదేశాలకు పంపగా.. సింధు నాగరికతకు వాటికీ సంబంధం లేదని తెలిసింది. దీంతో ఇవే ద్వారకా అవశేషాలేనని పరిశోధకులు భావిస్తున్నారు.
ఈ అన్వేషణలో అనేక కళాకృతుల అవశేషాలు బయటపడ్డాయి. అందమైన రంగు రంగుల వస్తువులు లభించాయి. వాటిపై ఎన్నో రంగులు ఉన్నాయి. 500ల కన్నా ఎక్కువ కళాకృతులు, రకరకాల నమూనాలు లభించాయి. ఇవన్నీ రెండు వేల సంవత్సరాల నాటి సంస్కృతికి చిహ్నంగా నిలిచాయి. పలు రాతి దిమ్మెలు లభించాయి. కానీ, ఈ రాళ్లకు, బయట ఉన్న రాళ్లకు సంబంధం తెలియలేదు. తవ్వకం జరిపిన చోట అంతర్గత నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది అని పరిశోధకులు వెల్లడించారు.
End of Article