Ads
హైదరాబాద్ అనగానే మనకు గుర్తుకువచ్చేది చార్మినార్. ఆ తర్వాత నగరం నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్, అందులోని బుద్ధ విగ్రహం. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ విగ్రహం హైదరాబాద్ కి ఒక ప్రత్యేకత తెచ్చింది.
Video Advertisement
టాంక్‌బండ్ పక్కనున్న హుస్సేన్ సాగర్‌లో ‘జిబ్రాల్టర్ రాక్’ అనబడే రాతిపైన ఈ పెద్ద బుద్ధ విగ్రహాన్ని అమర్చారు. ఒకే రాతిలో మలచబడిన ఈ విగ్రహం 17.5 మీటర్ల (58 అడుగులు) ఎత్తు ఉండి 350 టన్నుల బరువుంటుంది. అయితే ఈ విగ్రహ ప్రతిష్ట సమయం లో ఎనిమిది మంది మరణించారు. ఇది హుస్సేన్ సాగర్ అడుగున రెండేళ్లు ఉందని ఈ తరం వారిలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం.
1983లో సీఎం అయ్యాక ఎన్టీఆర్ పలుమార్లు అమెరికా వెళ్లి వచ్చారు. అక్కడ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూశారు. అమెరికా అంటే వైట్ హౌస్‌తో పాటు ఇది ఠక్కున గుర్తుకు వస్తుంది. అందుకే మన దగ్గర కూడా ఇటువంటి స్టాట్యూ ఉండాలని రామారావు గారు భావించారు. ఈ క్రమంలోనే చర్చలు జరిపి.. సత్యాన్వేషి, శాంతికి మారుపేరైన బుద్దుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
హైదరాబాదుకు 60 కి.మీ. దూరంలోని ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలోని రామగిరి-భువనగిరి గుట్టల్లోని రాతితో.. SM గణపతి స్థపతి నేతృత్వంలో 40 మంది శిల్పులు రెండు సంవత్సరాలు శ్రమించి ఈ శిల్పాన్ని మలచారు. దేశంలో అత్యంత పెద్దదైన ఈ బుద్ధుడి ఏకశిల విగ్రహం కోసం టీడీపీ సర్కార్ అప్పట్లో దాదాపు 5.5 కోట్ల రూపాయలను వెచ్చించింది.
హుస్సేన్ సాగర్‌లో విగ్రహం ప్రతిష్టించడానికి 15 అడుగుల వేదిక కూడా నిర్మించారు. అయితే ఒక ఎదురుదెబ్బ తగిలింది ఎన్టీఆర్‌కు. విగ్రహ ప్రతిష్టాపనకు మూడు నెలలు ఉందనగా (1989 డిసెంబర్‌లో) ఎన్టీఆర్ ప్రభుత్వం దిగిపోయింది. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
బుద్దుడి విగ్రహం ప్రతిష్టించాలని చెన్నారెడ్డి నిర్ణయించడంతో పనులు ముందుకు సాగాయి. ఏబీసీ ఇండియా అనే కంపెనీకి 1990 మార్చి 10న హుస్సేన్ సాగర్‌కు విగ్రహం తీసుకొచ్చే కాంట్రాక్టు అప్పగించారు. అప్పట్లో రోడ్లు ఇరుకుగా ఉండటంతో ఆ విగ్రహాన్ని తరలించడం కష్టమైంది. విగ్రహం తరలింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రోడ్లు సైతం వేసింది. కొన్ని రోడ్లు వెడల్పు చేసింది. ట్రక్‌లో విగ్రహాన్ని హుస్సేన్ సాగర్‌కు తరలించారు. రిబ్బన్ కట్ చేసిన తర్వాత విగ్రహాన్ని అప్పటికే సిద్ధం చేసిన భారీ పడవలోకి తరలించారు.
100 మీటర్లకు పైగా దూరం ప్రయాణించాక పడవ ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. ఎంతలా అంటే ఆ అలల ధాటికి పక్కన ప్రయాణిస్తున్న ఓ పడవ పైకి లేచి నీటిలో పడిపోయింది. విగ్రహం నీటిలోకి మెల్లగా జారిపోవడం మొదలైంది. విగ్రహం తరలించడానికి ఏబీసీ కంపెనీ ఏర్పాటుచేసిన వర్కర్లు దాని కిందే ఉండిపోయారు, పైకి రాలేకపోయారు. ఓ ఐదు గంటల అనంతరం విగ్రహం పూర్తిగా నీటిలో మునిగిపోయింది.
ఈ హఠాత్పరిణామానికి దేశం అంతా ఉలిక్కిపడింది. విగ్రహం తరలింపు ప్రక్రియపై విమర్శలు తలెత్తాయి. భారీ విగ్రహాల తరలింపులో ఎలాంటి అనుభవం లేని కంపెనీకి అలాంటి పెద్ద బాధ్యతను ఎలా అప్పగించారని విమర్శించారు. ఇక ఆ తర్వాత 1992 అక్టోబర్‌లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక విగ్రహాన్ని బయటకు తీసే పనులు చేపట్టారు. అదే ఏడాది ప్రత్యేక క్రేన్ల సాయంతో హుస్సేన్ సాగర్‌లో మునిగిపోయిన బుద్దుడి విగ్రహాన్ని బయటకు తీశారు.
1992 డిసెంబర్ 1న విగ్రహాన్ని ప్రతిష్టించారు. 1994లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో సుందరీకరణ పనులు చేయించారు. ట్యాంక్ బండ్ చుట్టూ పలువురు చరిత్రకారుల విగ్రహాలు కూడా ఎన్టీఆర్ చెక్కించి, నెలకొల్పారు.
End of Article