పెద్దలు కుదర్చిన వివాహాలు అనాదిగా మన సంప్రదాయంలో వందల ఏళ్లుగా భాగమయ్యాయి. సంప్రదాయ పెళ్లిళ్లపైన నమ్మకం ఇంకా చెరిగిపోలేదనే చెప్పాలి. ప్రేమ వివాహాలు కూడా పెద్దలు కుదిర్చిన వాటిలా మల్చుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. తమ జీవిత భాగస్వాములను అనుకోకుండా కలవకపోయినా తల్లిదండ్రులే ఏరికోరి సరైన జోడిని ఎంపిక చేయడం అదృష్టమే.
అయితే ఇప్పటికీ చాలా మందికి ప్రేమ పెళ్లి గొప్పదా.. పెద్దలు కుదిర్చిన పెళ్లి గొప్పదా అనే ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రపంచం లో ప్రతి ప్రశ్నకి సంధానం దొరికే కోరా లో దీనికి సంబంధించిన ఒక ప్రశ్న వచ్చింది.. ‘పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న తర్వాత మీ భాగస్వామి పై ప్రేమ ఎప్పుడు పుట్టింది..?’ అని..దానికి అనేక మంది సమాధానాలు ఇచ్చారు.
అయితే మోనిష అనే యూజర్ తన జీవితంలో జరిగిన అనుభవాన్ని పంచుకున్నారు.. ఇందుకు ఆ అమ్మాయి, “అసహ్యం అని ప్రశ్నలో అడిగి ఉంటే మరోలా ఉండేది ఏమో” అంటూ తన కథ చెప్పడం మొదలు పెట్టారు. ” మాది మిడిల్ క్లాస్ కుటుంబం. ఇద్దరం అమ్మాయిలం, అక్క నేను. ఇంజనీరింగ్ పూర్తి చేశాక, అందరి తల్లితండ్రులాగే నాకు సంబంధాలు చూసారు. రెండో సంబంధంకే నా పెళ్లి నిశ్చయం అయ్యింది. వారితో ముందుగానే చెప్పను నాకు ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేదు అని.. వాళ్ళు ఒప్పుకున్నారు.
వాళ్ళది బాగా సంపన్న కుటుంబం. అతను వేరే దేశంలో స్థిర పడ్డాడు. మా ఇద్దరికీ వయసు తారతమ్యం ఎక్కువగా ఉంది. అయినా నా జీవితం బాగుంటుంది అని తాహతుకి మించి పెళ్లి చేసారు. ఎన్నో ఆశలతో అత్త వారింటికి వెళ్ళాను. వెళ్ళిన రెండో రోజే నన్ను మా ఆయనను వేర్వేరు గదుల్లో పడుకోమని చెప్పారు. ఆ తర్వాత నుంచి కట్నం చాలా తక్కువ తెచ్చాను అని వేధించడం మొదలు పెట్టారు అత్త గారు, నా భర్త.
ఒక నెల తరువాత అతను ఉండే దేశానికి వెళ్ళాను. అక్కడ నాకు నరకం చూపించాడు. కొట్టడం, తిట్టడం చేసేవాడు. అతని బాధ భరించలేక ఒక చిన్న ఉద్యోగం చేయడం మొదలు పెట్టాను. బస్ ఖర్చులు తప్పితే ఇంకో పైసా ఇచ్చే వాడు కాదు. నా జీతం తీసుకొని అతని పేరు మీద బ్యాంక్ లో వేసుకున్నాడు. చాలా సార్లు వీధిలోనే కొట్టేవాడు. చివరికి 15 లక్షలు తెస్తేనే కలిసి ఉంటా అంటూ నన్ను గెంటేశారు.
అప్పటికి పెళ్లి అయ్యి రెండేళ్లే అయ్యాయి. చేతిలో బిడ్డ తో రోడ్ మీద నిలబడ్డాను. చివరికి నాకు విడాకులు ఇచ్చాడు. నేను తన స్థాయికి సరితూగను అని. నాకు భాగస్వామి మీద అసహ్యం వేసింది. అసలు పెళ్లి మీదే నమ్మకం పోయింది. ప్రేమ వివాహం అయినా.. పెద్దలు కుదిర్చినది అయినా భార్యాభర్తలకి ఒకరంటే ఒకరికి నమ్మకం, గౌరవం ఉండాలి. అప్పుడే ప్రేమ పుడుతుంది. 15 సంవత్సరాలుగా ఈ ప్రశ్న నన్ను వేధిస్తూనే ఉంది. నా తప్పు ఏంటి?” అని మోనిష రాసుకొచ్చారు.
ఏ బంధమైనా బలంగా ఉండాలంటే.. వారిద్దరి మధ్య సఖ్యత, అర్థం చేసుకునే మనస్తత్వం, ప్రేమానురాగాలు ఉండాలి. ఇలాంటివి ఉన్న వారి బంధం పది కాలాల పాటు పదిలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు ఎంచుకున్న భాగస్వామి ఎలా ఉన్నారని కాదు.. మీ రిలేషన్ షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉందనే విషయాన్ని మీరు గుర్తించాలి.