భారతీయ వివాహ వ్యవస్థ ఎంత ఔన్నత్యమైనదో.. మహిళల పట్ల భారత సమాజం లో ఉన్న భావాలు అంత సంకుచితమైనవి. అందుకే మహిళలు పెళ్లి తరువాత ఉద్యోగం చేస్తున్నా.. చేయకపోయినా.. ఏదో ఒక రకం గా వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు.
పెళ్లి అయ్యాక ఉద్యోగం ఎందుకు..కుటుంబాన్ని పట్టించుకోలేవు.. అంటూ ఉద్యోగం చేస్తున్న వారిని హేళన చేస్తూనే ఉంటారు. అదే ఏ ఉద్యోగమూ లేకపోతె..నీకేమి పని ఉంది అని హేళన చేస్తుంటారు.. అసలు పెళ్లి అయిన తరువాత ఉద్యోగం లేకుంటే.. మహిళలు ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కుంటారో ఇప్పుడు చూద్దాం..
20 నుంచి 30 సంవత్సరాల వయసు లో:
20 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నపుడు పెళ్లి అయ్యాక ఏదైనా జాబ్ గురించి ప్లాన్ చేస్తున్నావా? లేక ఏదైనా బిజినెస్ నడిపే ఆలోచన ఉందా…? నీ భవిష్యత్ ను ఎలా ప్లాన్ చేసుకోబోతున్నావ్..? అంటూ ప్రశ్నించే వాళ్ళే ఎక్కువ ఉంటారు.
40 నుంచి 50 సంవత్సరాల వయసు లో:
పొద్దున్న నుంచి.. సాయంత్రం వరకు ఇంట్లో ఖాళీ గా ఉండి ఏమి చేస్తున్నావ్.. నీకు బోరు కొట్టడడం లేదా అంటారు.. అందుకే కిట్టి పార్టీలకి వెళ్తున్నావ్ అంటూ సెటైర్ లు వేసే వాళ్ళు కూడా ఉంటారు.. కొంతమంది అయితే.. అయిన ఎలాంటి ఆఫీస్ టార్గెట్ లు లేకుండా ఇలా జాలీ గా లైఫ్ గడపడానికి అదృష్టం ఉండాలి అంటూ నిట్టూర్పులు విడుస్తూంటారు.
60 సంవత్సరాల వయసు పై బడ్డాక :
అంత వయసు వచ్చాక కూడా హ్యూమిలియేషన్ ఉంటుందా అని ఆశ్చర్యపోకండి.. కచ్చితం ఏదో ఒక నిట్టూర్పో.. వెకిలి కామెంట్ నో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్నాళ్లు ఖాళీ గా ఉన్నావ్ కాబట్టి ఇప్పుడు ఖాళీ గా ఉండడం కొత్త గా అలవాటు చేసుకోక్కర్లేదు లే.. అదే జాబ్ ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు సమయం ఎలా గడపలో తెలీక ఇబ్బంది పడతారు అంటూ పైకి నవ్వుతూనే గుండెని కోసేసే మాటల్ని చెప్తూ ఉంటారు.
ఏ మహిళ అయినా పలు కారణాల వలన గృహిణి గా ఉండిపోతుంది. కొందరు తమ భర్త కు వచ్చే జీతం సరిపోవడం వల్ల ఉద్యోగం చేయక్కర్లేదు అనుకుంటారు. మరి కొందరు పిల్లల పెంపకం విషయం లో భర్త కు సమయం లేకపోతె.. ఆ బాధ్యతను తమ నెత్తిన వేసుకుని కెరీర్ కి స్వస్తి పలుకుతారు. ఇక మరి కొందరు ఇళ్ళలో ఒప్పుకోకపోతేనో.. మరే ఇతర కారణాల వలనో కెరీర్ కి దూరం అవుతూ ఉంటారు. లేక పొతే భర్తలు ఉద్యోగం చేసే సమయాలు గజిబిజి గా ఉంటె.. వీరు ఇంట్లోనే ఉండి కుదిరినప్పుడల్లా తమ భర్తలతో గడపడానికి ఇష్టపడతారు.
కారణాలు ఏమైనా కావచ్చు. కానీ, ఉద్యోగం చేయని కారణం గా ఓ మహిళను కించపరచడం మాత్రం సరికాదు. ఎందుకంటే.. గృహిణి గా లెక్కలేనన్ని బాధ్యతలు ఉంటాయి. దురదృష్టం ఏంటి అంటే.. ఉద్యోగం చేసే మహిళలు ఇవన్నీ చూసుకోలేక సతమతం అవుతూనే.. తోటి ఉద్యోగం లేని మహిళలను గేలి చేస్తుంటారు. ఉద్యోగం చేయడం, చేయకపోవడం అన్న విషయం పై ఏ మహిళ అయినా స్వతంత్రం గా నిర్ణయం తీసుకోగలదు. దానిని ప్రశ్నించే అర్హత, హక్కు ఎవరికీ ఉండదు అన్న విషయం గుర్తుంచుకోవాలి.