ప్రతి తండ్రికి తన కూతురు అంటే ఎంతో ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అలాగే.. కూతురుకు కూడా తండ్రి అంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. ప్రతి కూతురు కధలో మొదటి హీరో గా తండ్రే ఉంటాడు.
భర్త అంటే ఎంత ప్రేమ ఉన్నప్పటికి.. కూతురు మనసులో తండ్రి స్థానం మాత్రం ఎప్పటికి చెరపలేనిది. వారిద్దరి బంధమే ఎంతో ప్రత్యేకమైంది. అలాంటి ఓ తండ్రీకూతుళ్ల మధ్య జరిగిన ఈ సంఘటన కంటతడి పెట్టిస్తోంది.
ఓ రోజు ఓ తండ్రి తన కూతురు ఇంటికి వెళ్ళాడు. అనుకోకుండా వచ్చిన తండ్రిని చూసి ఆ కూతురు మురిసిపోయింది. మరోవైపు అంతే గాబరా పడింది. ఎందుకంటే.. తన తండ్రికి పెట్టడానికి ఇంట్లో ఏమి లేవు. డబ్బాను ఎంత తడిమి తీసినా కప్పు బియ్యం కూడా రాలేదు. దీనితో ఆమె చాలా బాధపడింది. తన సంసారం తండ్రి కంటబడక తప్పదేమో అని బాధపడింది. ఆమెను కంటిచూపులతోనే అర్ధం చేసుకోగలిగే ఆ తండ్రి వంటింట్లో పరిస్థితిని గమనించాడు.
పిల్లను ఎంత గారం గా పెంచాడో గుర్తు చేసుకుని బాధపడ్డాడు. వ్యాపారం పేరుతో, అల్లుడు లక్షణం గా చేస్తున్న ఉద్యోగం వదిలేయడమే ఇంతటి పరిస్థితికి కారణమైందని చింతించాడు. ఆ తరువాత వెంటనే బయలుదేరాడు. చిన్న పని ఉందమ్మా.. ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్ళాడు.. కాసేపటికి ఇంటిముందు ఓ రిక్షా ఆగింది. ఆ రిక్షాలో తెచ్చిన సరుకులన్నిటిని తండ్రి ఇంటి లోపల పెట్టిస్తున్నారు.
ఆయన కూతురు ఏమి మాట్లాడలేక కళ్ళ నీరు పెట్టుకుంది. “ఓర్చుకోమ్మా.. నీక్కూడా మంచిరోజులు వస్తాయి..” అంటూ ఆ తండ్రి ఆమెను ఓదార్చి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన దీవించినట్లే తొందరలోనే కూతురు కుటుంబానికి మంచి రోజులు వచ్చాయి. వ్యాపారం లో లాభం రావడం తో ఇల్లంతా కళ గా నిండిపోయింది. ఇంటినిండా సరుకులు, బియ్యం బస్తాలు తెచ్చి ఉన్నాయి.. ఆమె వైభోగం చూసి తండ్రి కడుపుతో పాటు మనసు కూడా నిండింది. ఆమెను మనసారా దీవించాడు. ప్రేమించే తండ్రి ఉన్న ఏ కూతురు అయినా ధనవంతురాలే.