తమిళ హీరో అయినా కూడా తెలుగులో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నారు తలపతి విజయ్. విజయ నటించిన తమిళ్ సినిమాలు అన్నీ కూడా అదే రోజు తెలుగులో కూడా విడుదల అవుతాయి. విజయ్ ప్రమోషన్స్ కి పెద్దగా హాజరు అవ్వరు. అయినా కూడా విజయ్ సినిమా వస్తుంది అంటే సందడి మామూలుగా ఉండదు. గత సంవత్సరం విజయ్ లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్ సినిమాలో నటించారు. గోట్ అంటే, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అని అర్థం. ఈ సినిమాలో విజయ్ రెండు పాత్రల్లో నటిస్తారు అని అంటున్నారు.
స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్ అమీర్, మౌనరాగం సినిమాతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు మోహన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమాలో భారీ తారాగణం ఉంది. యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఇప్పటికే చాలా పాపులర్ అయ్యాయి. డి ఏజింగ్ టెక్నిక్ ఉపయోగించి విజయ్ ని ఇందులో యంగ్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా రేపు విడుదల అవుతుంది. సినిమా బృందం అంతా కూడా ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. ఇటీవల హైదరాబాద్ కి వచ్చి, ఈవెంట్ నిర్వహించి, మీడియాతో మాట్లాడారు. అయితే, ఈ సినిమా సెన్సార్ టాక్ కూడా బయటకు వచ్చేసింది. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని సెన్సార్ బృందం తెలిపినట్టు సమాచారం.
ఇందులో యాక్షన్ చాలా ఎక్కువగా ఉందట. దాదాపు మూడు గంటల రన్ టైం ఉన్న ఈ సినిమాకి, ఇండియాలో యు/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. 181 నిమిషాలు రన్ టైం ఈ సినిమాకి ఉంది అని సమాచారం. అయితే, గతంలో విజయ్ నటించిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకి అసలు హైప్ లేదు. ఈ సినిమా రేపు రిలీజ్ అవుతున్న సంగతి కూడా ఎక్కువ మందికి తెలియదు. కానీ, సైలెంట్ గా రిలీజ్ అయ్యి హిట్ అయ్యే అవకాశాలు ఈ సినిమాకి గట్టిగా ఉన్నాయి అని సినీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆగాల్సిందే.