సాయంత్రం 6 గంటలకు నేను మా ఇంటి దగ్గరలోని ఒక కూరగాయల షాపుకు వెళ్ళాను. నాకు కావలసిన కూరలు తీసుకుంటుండగా, షుమారు 60 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి వచ్చి దాదాపు 50 కట్టల పాలకూర తీసుకున్నాడు. అది గమనించిన ఆ షాపు లోని ఆవిడ ఎవరు బాబు నువ్వు, ఇన్ని కట్టలు తీసుకుంటున్నావేంటి అని అడిగింది.
అమ్మా ! నేను ఇక్కడ దగ్గరలో కూలి పని చేసుకునే కార్మికుడ్ని అన్నాడు. ఏ ఊరు మీది అని అడిగింది, కర్ణాటక లోని శివమోగ్గ దగ్గర ఒక చిన్న పల్లెటూరు అన్నాడతను. మీరెంత మంది ఉన్నారు అని అడిగింది, ౩౦౦ మంది ఉన్నాము అన్నాడు. నీకు ఇంకేవైనా కూరలు కావాలా అని అడిగింది ఆవిడ, ఇవి చాలమ్మా, ఇంతకంటే కొనడానికి నా దగ్గర డబ్బు కూడా లేదు అన్నాడు.
చూడు బాబు, మీకు ఏ కూరలు కావాలన్నా తీసుకెళ్ళండి, డబ్బు అక్కర్లేదు, lockdown అయిపోయిన తరువాత అయినా సరే వచ్చి మీకు కావలసినవి తీసుకెళ్ళండి అన్నది ఆవిడ. ఇదంతా గమనిస్తున్న నాకు కళ్ళు చెమ్మగిల్లాయి. ఎంత ఉదార్త హృదయం ఈవిడది అనిపించింది. ఇంతలో మరొక పెద్దావిడ వచ్చింది, ఏం అవ్వా ఎలా ఉన్నావు, మందులు వేసుకున్నావా, అని పలకరించింది ఈవిడ. వేసుకున్నాను తల్లీ, ఇప్పుడు బాగుంది అని చెప్పింది.
ఆ ముసలావిడ కొన్ని కూరలు తీసుకుని, వెళ్ళొస్తాను అనింది, జాగ్రత్త, మరో రెండు రోజులు బయట తిరగకు, మందులేసుకో, అంటూ 100 రూపాయలు ఇచ్చింది ఆ షాప్ ఆవిడ. చాలా సంతోషంగా అనిపించింది నాకు, మీరు నిజంగా చాలా మంచి సేవ చేస్తున్నారు తల్లీ అని చేతులెత్తి దండం పెట్టాను. అయ్యో అలా అనకండి సర్, దేవుడు మనకిచ్చిన దానిలోనే చేతనైన సహాయం చేయడం మన కనీస బాధ్యత అని చెప్పింది.
అమ్మా మీ ఫోటో తీసుకోవచ్చా అని అడిగితే మొదట కాస్త తటపటాయిస్తూనే ఇవేవీ పేరు కోసమో, గొప్ప కోసమో చేసేవి కాదు సర్, నేను అంత గొప్ప దాన్ని కూడా కాదు అని బదులు చెప్పింది. అమ్మా మీ స్వభావం నాకు అర్ధమయ్యింది, కేవలం రెండు అరటి పళ్ళు పంచేసి ఫోటోలు తీసుకుంటూ, అందరికీ చెప్పుకునే మనుషులున్న సమాజంలో మీలాంటి వారు ఎందరికో ఆదర్శనీయులు అన్నాను. ఆవిడ సరే సర్ అని సిగ్గుగానే ఫోటో తీసుకోవడానికి అంగీకరించారు.
ఈ ఫోటోలో ఉన్నది ఆ మాతృమూర్తి, ఈవిడ బెంగళూరు లోని రాజాజీ నగర్ లో ఉంటారట, ఈ తల్లి పేరు మమత, పేరుకు తగ్గట్టు గానే మమతను ఆప్యాయతను పంచుతోంది , పేదల ఆకలి తీర్చడానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్న అన్నపూర్ణా స్వరూపిణి . ” దైవం మానుష రూపేణ ” అన్న మహా వాక్యానికి నిలువెత్తు నిదర్శనం ఇటువంటి మహాత్ములే .వాట్సాప్ లో వచ్చిన ఇంగ్లీష్ మెసేజ్ తెలుగులోకి అనువదించాను .
source: whatsapp forward message