అన్ని సీజన్లలోనూ చలి కాలం చాలా బాగుంటుంది. కుండపోత వర్షాలుండవు, మండిపోయే ఎండలుండవు. శీతాకాలం లో వాతావరణం ఎంతో ఆహ్లదకరం గా ఉంటుంది. కానీ, చలి కాలం వచ్చిందంటే మాత్రం ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి.
ఎక్కడ లేని సమస్యలు ఈ కాలం లోనే వస్తుంటాయి. సాధారణం గా వచ్చే జలుబు, దగ్గు, చర్మం పొడిబారడం వంటి సమస్యలు మామూలుగానే వస్తూ పోతూ ఉంటాయి. ఎక్కువగా ఎముకకు సంబంధించిన సమస్యలు కూడా వస్తుంటాయి.
అందుకే ఈ కాలం లో ప్రతిరోజు ఎముకకు సంబంధించిన ఆహరం తీసుకుంటే ఎముక బలంగా ఉంటుంది. అటువంటి ఆహార పదార్ధాల్లో అరటి పండు కూడా ఒకటి. నిమిషాల్లో ఎనర్జీ ని ఇచ్చేయడం, ఎక్కువ పోషకాలను కలిగి ఉండడం అరటిపండు ప్రత్యేకత. అరటిపండు తినడం ద్వారా రక్తహీనత నుంచి బయటపడచ్చట. అలాగే అరటిపండు శరీరం లోని చెడు కొలెస్టరాల్ ను నియంత్రిస్తుంది.
కొవ్వు పెరగకుండా చేసి గుండెను రక్షిస్తుంది. అలాగే ఎముకలను కూడా బలపరుస్తుంది. కాల్షియం లోపం వల్ల వచ్చే ఇబ్బందులను రోజుకో అరటిపండు తినడం ద్వారా ఎదుర్కోవచ్చు. మానసిక ఒత్తిడి కి గురి అవుతున్నవారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. డిప్రెషన్ ను నివారిస్తుంది. అరటిపండు లో ఫైబర్ ఎక్కువ గా ఉంటుంది. ఇది జీర్ణాశయ వ్యవస్థ సక్రమం గా పని చేసేలా చేస్తుంది.
అలాగే.. ఇది తినడం వలన తొందరగా ఆకలి వేయదు. అయితే.. రాత్రి పూట మాత్రం అరటిపండుని తీసుకోకండి. ఎందుకంటే దీనివలన జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. గుండె జబ్బులు, కరోనరీ ఆర్టరీ వ్యాధుల నుంచి రక్షించడంలో అరటిపండు తోడ్పడుతుంది. ఏదైనా తీపి ఎక్కువగా తినాలి అని కోరిక కలిగినప్పుడు అరటిపండుని తినడం ఉత్తమం. తద్వారా మీరు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతారు.
జిమ్ కి వెళ్ళినప్పుడు, లేదంటే వ్యాయామం చేయడం పూర్తి అయ్యాక కూడా అరటిపండుని తీసుకుంటే వెంటనే ఎనర్జీ లభిస్తుంది. సాయంత్రం సమయాల్లో అరటిపండ్లు తినడం మంచిది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోజంతా కష్టపడ్డాక.. సాయంత్రం సమయంలో అరటిపండు తీసుకుంటే కండరాలకు పొటాషియం అంది బలంగా ఉంటాయి. అలసట తగ్గి, నిద్ర కూడా బాగా వస్తుంది.