పరిపూర్ణ నటుడు, గాయకుడూ, రచయిత తనికెళ్ళ భరణి గారి గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలన్ గా, తండ్రి గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన నటించిన పాత్రలు బోలెడు. ఆయన సినిమాలో కనిపించారు అంటే ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేస్తారు. ఆ పాత్రకు కచ్చితంగా ఎంతో కొంత ప్రాముఖ్యత ఉంటుంది. తనకు ఇచ్చిన రోల్ ఏదైనా తన మార్క్ ప్రత్యేకతను ఆయన చూపించగలరు అనడం లో ఎలాంటి సందేహం లేదు.
ఆయనను విలన్ గా బాగా పాపులర్ చేసిన సినిమా ” మాతృ దేవో భవ”. కె. అజయ్ కుమార్ ఈ సినిమా కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా 1993 లో విడుదల అయింది. ఒక వితంతువు అయిన స్త్రీ.. తానూ త్వరలోనే కాన్సర్ కారణం గా చనిపోతానని తెలుసుకుని.. పిల్లల భవిష్యత్ ను దృష్టి లో ఉంచుకుని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది .. ఎంత తపన తీసుకుంటుంది అన్న పాయింట్ చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. ఆ అమ్మాయి గా మాధవి, ఆమె భర్త గా నాజర్ తమ తమ పాత్రలలో జీవించేసారు.
ఈ సినిమాలో విలన్ గా, ఓ దుర్మార్గుడి గా తనికెళ్ళ భరణి నటించారు. ఈ పాత్రకు ఆయన ఎంత గా ప్రాణం పోశారో.. ఈ సినిమా విడుదలయ్యాక ఆయనను ద్వేషించిన వారి సంఖ్యే చెబుతుంది. తాగుబోతు పాత్ర పోషించిన నాజర్, తనను తాను మార్చుకుని కుటుంబ బాధ్యతలు తీసుకుంటాడు. ఆ సమయం లోనే మాధవి పై అప్పారావు (తనికెళ్ళ భరణి) కన్ను పడుతుంది. సత్యం గా నటించిన నాజర్ ను కత్తి తో పొడిచి పొడిచి చంపేస్తాడు. తనను చంపద్దంటూ సత్యం ఎంత వేడుకున్నా వినిపించుకోడు. ఈ సీన్ సమయం లో ప్రేక్షకులు కూడా కన్నీళ్లు పెట్టేస్తారు.
ఆ తరువాత జరిగే సంఘటనలు మరింత హృదయ విదారకం గా ఉంటాయి. అప్పారావు పాత్ర పై ప్రేక్షకుడు ద్వేషం పెంచుకుంటాడు. ఎంత లా అంటే.. ఈ సినిమా విడుదలయ్యాకా.. తనికెళ్ళ భరణి చాలా చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటి గురించి ఆయన ఓ ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.
ఓ రోజు కూరగాయలు అమ్ముకునే అమ్మాయి వచ్చి.. “ఏంటి సారూ.. ఆయనను అలా చంపేశారు..” అంటూ అడిగిందట.. అందుకు ఆయన “సినిమానే కదమ్మా” అని చెప్పినా కూడా.. సినిమా ఐతే మాత్రమే అంతలా పొడిచి చంపుతారా.. అంటూ తిరిగి ప్రశ్నించింది. నిజానికి ఈ సినిమా చూసినపుడు తన పాత్రను చూసుకున్నప్పుడు తనకి కూడా కోపం వస్తుంది అంటూ తనికెళ్ళ భరణి చెప్పుకొచ్చారు. ఓ సారైతే.. అవుట్ డోర్ షూటింగ్ కోసం వేరే ఊరు వెళ్ళినప్పుడు కూడా.. అక్కడ ఆడవాళ్ళూ కూడా బూతులు తిట్టారని తనికెళ్ళ భరణి చెప్పుకొచ్చారు.
అలాగే, “ఆమె” సినిమా లో కూడా అంతే. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి మరదలిని వేధించే వేషం వేశారు. ఈ సినిమా తన భార్య, మరదలితో కలిసి చూశానని.. ఈ సినిమా అయిన తరువాత నుంచి తన మరదలు తనను అనుమానం గా, తేడా గా చూసేదని తనికెళ్ళ భరణి చెప్పుకొచ్చారు. ఓ సినిమా ప్రేక్షకులపై అంత ప్రభావం చూపిస్తుంది అనడానికి ఈ సంఘటనలే ఉదాహరణ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.