వేసవి కాలం మొదలవుతోంది. ఇక నుంచి క్రమ క్రమంగా ఎండలు ముదిరిపోతూ ఉంటాయి. ఇలాంటి టైంలోనే మనకి ఫ్రిడ్జ్ అవసరం ఎక్కువ ఉంటుంది. ఎంత ఎండలో తిరిగి వచ్చినా.. ఇంటికి వచ్చేసరికి ఫ్రిడ్జిలో చల్లని వాటర్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే ప్రాణం ఉసూరుమంటుంది.
అందుకే.. మనం తినే లేదా తాగే ప్రతి పదార్ధాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేయడం అలవాటు చేసుకున్నాం. అయితే.. కనిపించిన ప్రతి ఫుడ్ ఐటెంని పాడైపోతుందన్న భయంతో ఫ్రిడ్జ్ లో పెట్టేయకూడదు. కొన్ని పదార్ధాలను ఫ్రిడ్జ్ లో పెట్టడం వలన వాటి సహజ విలువలని కోల్పోయి అవి విషంలా మారతాయి. అందుకే కొన్ని పదార్ధహాలను ఫ్రిడ్జ్ లో పెట్టుకోకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
1. బ్రెడ్: చాలా మంది బ్రెడ్ ను సగం తిన్నాక.. మిగిలిన బ్రెడ్ స్లైసులను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తూ ఉంటారు. అవి ఫ్రిడ్జ్ లో పెట్టడం వలన గట్టిగా అయిపోతాయి. మనం తినలేని పరిస్థితికి వచ్చేస్తాయి. అంతేకాదు.. కొన్ని రకాల బ్రెడ్స్ అదోలాంటి వాసన వస్తాయి.వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టాక తినకపోవడమే మంచిది.
2. పువ్వులు: చాలా మంది పూజ కోసం ఒకేసారి ఎక్కువ పూవులు కొనుక్కుని రోజు కొంచం వాడుకుంటూ ఉంటారు. నిజానికి పూవులను కూడా ఫ్రిడ్జిలో పెట్టడం సరికాదు. దీనివలన ఆ పూవులకు ఉన్న సువాసన ప్రభావం ఇతర ఆహార పదార్ధాలపైనా పడుతుంది.
3. అరటిపండ్లు: అరటిపండ్లని కూడా విడిగానే ఉంచుకుని భుజించాలి. వీటిని ఫ్రిడ్జ్ లో పెడితే.. వీటిల్లో లభించే ఎంజైములు తమ శక్తిని కోల్పోతాయి. అలాగే తొక్క కూడా త్వరగా నల్లబడి, పండు త్వరగా పాడైపోతుంది.
4. పచ్చళ్ళు : తెలుగు వారు పచ్చళ్ళ ప్రియులు. కాలానికి తగ్గట్లు పచ్చళ్ళు చేసుకుని వాటిని ఫ్రెష్ నెస్ కోసం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే.. ఊరగాయలు ఫ్రిడ్జిలో పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అవి పాడైపోయే అవకాశం ఉంటుంది. పచ్చళ్ళను పెట్టేటప్పుడు మూతకి, డబ్బాకి మధ్య కవర్ ను ఉంచాలి.
5. ఉల్లిపాయలు: వీటిని కూడా ఫ్రిడ్జ్ లో నిల్వ చేయకూడదు. కొంతమంది వీటిని ఒకేసారి ఎక్కువగా కట్ చేసి ఫ్రిడ్జిలో పెట్టుకుంటుంటారు. అవసరమైనప్పుడు వాడుకోవచ్చని అనుకుంటారు. కానీ, అలా కూడా చేయకూడదు. వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టడం వలన ఉల్లిపాయల వాసన ప్రభావం ఇతర ఆహారపదార్ధాలపై కూడా పడుతుంది.
6. పుచ్చకాయలు: సాధారణంగా మనకి పుచ్చకాయలు చల్లగానే తినడం ఇష్టం ఉంటుంది. కానీ, పుచ్చకాయలు ఒకసారి కట్ చేసిన తరువాత ఫ్రిడ్జ్ లో పెట్టడం కంటే.. కట్ చేయకముందే మొత్తం కాయని ఫ్రిడ్జ్ లో ఉంచడం బెటర్.
7. బంగాళాదుంపలు: బంగాళా దుంపలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టడం వలన ఆ చల్లదనానికి త్వరగా కుళ్ళి పాడైపోతాయి. అదే బయట ఉంచేస్తే ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి.
8. తేనే: తేనే బయట ఉంచితే ఎన్ని సంవత్సరాలు అయినా పాడైపోదు. కానీ ఫ్రిడ్జ్ లో పెడితే తేనే రుచి మారిపోతుంది. అడుగున భాగం గట్టిపడిపోతుంది. దానికంటే ఏదైనా అల్మారా లో పెట్టుకోవడం మంచిది.