భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. చుట్టూ ఉన్న పరిసరాలు మారడంతో పాటు, ప్రజల ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో కూడా ఎంతో మార్పు వచ్చింది. అలాగే ఎంత మంది ఆలోచించే విధానంలో కూడా కాలంతో పాటు మారుతూ ఉన్నారు. కానీ కొంత మంది మాత్రం ఇప్పటికీ కూడా కొన్ని ఆలోచనలని మార్చుకోలేక పోతున్నారు. దానివల్ల వారి సొంత వాళ్లు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇదే విషయంపై ఒక యువతి తన సమస్య గురించి ఈ విధంగా చెప్పింది.
“నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను. నేను ఒక బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాను . కాలేజీలో ఉన్నప్పుడు ఒక అతను నేను అంటే ఇష్టమని చెప్పాడు. నేను అస్సలు పట్టించుకోలేదు. తర్వాత ఒకరోజు కనిపిస్తే తిట్టి, ఇంకోసారి నా వెంట పడొద్దు అని చెప్పి పంపించాను. అప్పటినుంచి అతను మళ్లీ నాకు కనిపించలేదు. ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ పరీక్షలకి ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాను.
ఒక కోచింగ్ సెంటర్ లో చేరాను. ఆశ్చర్యంగా అతను కూడా అదే కోచింగ్ సెంటర్ లో కనిపించాడు. కానీ అతను నన్ను అసలు చూడలేదు. సరే, ఆ విషయం జరిగే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి కూడా దాని గురించి ఆలోచించడం ఎందుకు అని చెప్పి, నేనే వెళ్లి మళ్లీ అతనిని పలకరించాను. అతను కూడా నన్ను చూసి ఆశ్చర్యంగా నేను అక్కడ ఉండడం ఏంటి? ఏం చేస్తున్నాను? అనే వివరాలన్నీ అడిగాడు.
అలా మెల్లగా మేము స్నేహితులమయ్యాం. అతను చాలా మంచివాడు. నేను అతనిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నాకు కూడా అతనిపై ఇష్టం కలిగింది. నేను నా ప్రేమ గురించి అతనికి చెప్పాను అతను చాలా సంతోషపడ్డాడు. ఇద్దరం ఎలాగైనా గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించిన తర్వాత, మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి మాట్లాడదామని అనుకున్నాము. అనుకున్నట్టుగానే మా ఇద్దరికీ చాలా మంచి ఉద్యోగాలు వచ్చాయి.
ఉద్యోగంలో చేరిన కొన్ని నెలల తరువాత, అతను వాళ్ళ ఇంట్లో మా ఇద్దరు గురించి చెప్పాడు. వాళ్ళ అమ్మానాన్న సరే అన్నారు. నేను మా ఇంట్లో మా ఇద్దరి గురించి చెప్పాలి. అప్పటివరకు నేను ఆలోచించని ఒక విషయం, ఇప్పుడు ఇంట్లో చెప్పాలి అనేటప్పటికి గుర్తొచ్చింది. అదే కులం. అవును. మా ఇద్దరి కులాలు వేరు.
కానీ ఈ కాలంలో కూడా కులం గురించి ఆలోచించి ప్రేమను చంపుకోవడం అనేది నాకు చాలా తప్పుగా అనిపించింది. దాంతో ఏదైతే అదే అయ్యింది అని ధైర్యం చేసి మా అమ్మనాన్నలకు ఈ విషయం చెప్పాను. వాళ్లు అబ్బాయికి సంబంధించిన వివరాలు అన్నీ అడిగారు నేను అన్నిటికీ సమాధానం చెప్పాను. చివరికి కులం గురించి అడిగారు నేను చెప్పాను.
ముందు వరకు మామూలుగా ఉన్న నాన్న, కులం వేరు అని చెప్పగానే కోపం తెచ్చుకున్నారు. నేను ఎంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా కూడా నాన్న అసలు నా మాట వినట్లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? మా ఇంట్లో వారిని ఎలా ఒప్పించాలి? నా సమస్యకు మీరే పరిష్కారం తెలపండి.
NOTE: images used in this article are just for representative purpose. But not the actual characters.