గత కొద్ది రోజులుగా భారతదేశం అంతటా ఒకటే వినిపిస్తోంది. జైశ్రీరామ్ అనే నామం. అయోధ్య వేడుక తర్వాత భారతదేశం అంతా కూడా శ్రీరాముడి నామస్మరణతో నిండిపోయింది. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి.
చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాల్లో అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట జరిగిన రోజు కూడా ఒకటిగా నిలిచింది. ఒక పండుగలాగా ఆ రోజుని జరుపుకున్నారు. ఎన్నో శతాబ్దాల కృషికి ఫలితం ఇది. అందుకే ఇంత ఘనంగా జరుపుకున్నారు.

రామ మందిరంలో ప్రతిష్టించేందుకు ముగ్గురు శిల్పులు రాముడి విగ్రహాలను రూపొందించారు. వారిలో ఒకరు అరుణ్ యోగిరాజ్ అయితే, ఇంకొకరు గణేష్ భట్. మరొకరు రాజస్థాన్ కి చెందిన సత్యనారాయణ పాండే. అరుణ్ యోగిరాజ్ రూపొందించిన బాల రాముడి విగ్రహాన్ని గుడిలో ప్రతిష్టించారు. సత్యనారాయణ పాండే రూపొందించిన పాలరాతి విగ్రహాన్ని సైతం ఆలయంలో మరొకచోట ఉంచుతారు అని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.

అయితే, గణేష్ భట్ రూపొందించిన విగ్రహం మాత్రం ఎలా ఉంటుంది అనే విషయం తెలియలేదు. దాంతో ఆ విగ్రహం ఎలా ఉంటుంది చూడాలి అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అరుణ్ యోగిరాజ్ రూపొందించినట్టుగానే, గణేష్ భట్ కూడా నల్లరాతితో విగ్రహాన్ని తయారు చేశారు. రాముడి వెనుక భాగంలో అర్థ చంద్రాకృతిపై దశావతారాలు వచ్చేలాగా ఈ శిల్పాన్ని రూపొందించారు. ఒక చేతిలో విల్లు, మరొక చేతిలో బాణం ఉన్నాయి.

అరుణ్ యోగిరాజ్ రూపొందించినది బాల రాముడి విగ్రహం కాగా, గణేష్ భట్ రూపొందించిన విగ్రహం పెద్దయిన తర్వాత రాముడిలాగా ఉంది. రాముడు పద్మ పీఠం మీద నిలబడినట్టు రూపొందించి, ఒక వైపు బ్రహ్మ, మరొక వైపు లక్ష్మీదేవి, కింద ఒకవైపు హనుమంతుడు, మరొక వైపు గరుత్మంతుడు ఉండేలాగా ఈ విగ్రహాన్ని చేశారు. రాముడి కిరీటం మీద సూర్యభగవానుడిని కూడా రూపొందించారు. గణేష్ భట్ భారతదేశంలోని అతి పురాతన గణపతి దేవాలయంగా పేరుపొందిన ఇడగుంజి గణపతి ఆలయ పూజారుల కుటుంబానికి చెందినవారు.

గణేష్ భట్ ఇప్పటివరకు 2000 విగ్రహాలు రూపొందించారు. భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. రామ మందిరం కోసం 7.4 అడుగుల విగ్రహాన్ని చెక్కడానికి 8 మంది బృందం పనిచేశారు. విగ్రహం రూపొందిస్తున్నప్పుడు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలి అని అధికారులు చెప్పారు. ఈ విగ్రహం రూపొందించడానికి గణేష్ భట్ మైసూరు జిల్లాలోని హెగ్గడదేవనకోటే శివార్లలోని శ్యామ శిలని ఎంచుకున్నారు.

“శ్యామ శిల సహజమైన రాయి. భూమి లోపల ఉన్నప్పుడు ఇది చాలా మృదువుగా ఉంటుంది. కానీ బయటికి తీసిన తర్వాత, విగ్రహం చెక్కేటప్పుడు ఇది గట్టిగా మారిపోతుంది. సాధారణంగా దేవాలయాల్లోని విగ్రహాలను ఇదే రాతితో తయారు చేస్తారు” అని గణేష్ భట్ చెప్పారు. గణేష్ భట్ తో పాటు మొత్తం ఎ8 మంది ఈ విగ్రహం రూపొందించడానికి ఒక బృందంగా పనిచేశారు. గణేష్ భట్ తో పాటు ఈ విగ్రహం రూపొందించడానికి పనిచేసిన వారిలో, ఉత్తరప్రదేశ్‌కు చెందిన శిల్పి బిపిన్ సింగ్ బదురియా, ఇడగుంజికి చెందిన సందీప్ నాయక్ అనే శిల్పి ఉన్నారు.
ALSO READ : అయోధ్య రామ మందిరానికి అత్యధిక విరాళం ఇచ్చింది ఈయనే… సినిమా స్టార్ కాదు, బిజినెస్ మెన్ కాదు..!

ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు అయోధ్య రామ మందిర నిర్మాణానికి అతిపెద్ద విరాళాన్ని అందించారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు మొరారీ బాపు రామ మందిర నిర్మాణానికి అత్యధిక విరాళం ఇచ్చినట్టు ప్రకటించారు. మొరారీ బాపు గుజరాతీకి చెందిన ఆధ్యాత్మిక గురువు, రామ కథా పారాయణుడు.
1946లో గుజరాత్ లో జన్మించిన మొరారీ బాపు రామాయణ ప్రతిపాదకుడు. 60 ఏళ్ళుగా పండితుడు రామ కథా పఠనం ద్వారా సనాతన ధర్మం యొక్క ప్రాథమిక సూత్రాలను దేశ విదేశాల్లో చెబుతూ వస్తున్నారు. రామజన్మభూమి ట్రస్టుకు ఇప్పటికే రూ.11.3 కోట్లు ఇచ్చామని బాపు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కథ ప్రదర్శన, విదేశాల నుండి సేకరించిన మిగిలిన నిధులను రామజన్మభూమి తీర్థ ట్రస్ట్‌కు చేరుస్తారు. ఇలా మొత్తం రూ.18.6 కోట్ల విరాళాలు సేకరించిన మొరారీ బాపు ట్రస్ట్‌కు అందించారు.
శాంతియుతంగా అయోధ్య వివాద పరిష్కరించుకోవాలని మొరారీ బాపు పిలుపునిచ్చారు. రామ భక్తుడైన మొరారీ బాపు రామమందిరం ప్రారంభోత్సవంతో మనసు నిండిపోయిందని చెప్పారు. రాముడు ఏ ఒక్క దేశానికి లేదా వర్గానికి చెందినవాడు కాదని రాముడు అందరికీ చెందినవాడని అంటారు. రామ్ లల్లా దీక్ష తరువాత, ఫిబ్రవరి 24 నుండి మార్చి 3 వరకు మొరారీ బాపు అయోధ్యలో కథను ప్రదర్శించనున్నారని తెలుస్తోంది.























