సంగారెడ్డిలో ఇటీవల జరిగిన ఒక సంఘటన చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే వన్ ఇండియా తెలుగు కథనం ప్రకారం, సంగారెడ్డి జిల్లాలోని కంది మండలం చిమ్నాపూర్ కి చెందిన ఒక యువతిని, కొండాపూర్ మండలం మల్కాపూర్ కి చెందిన మాణిక్ రెడ్డి అనే ఒక యువకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు.
ఆరు నెలల క్రితం వారిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. పెళ్లికి ముందు కట్నకానుకల విషయాల గురించి కూడా మాట్లాడుకున్నారు. అందుకు కూడా యువతి కుటుంబం అంగీకరించింది. ఈనెల 12వ తేదీన పెళ్లి చేయాలని అనుకున్నారు. పెళ్లికి ఇంకో గంట సమయం ఉంది అనగా పెళ్లి కొడుకును తీసుకురావడానికి సాంప్రదాయం ప్రకారం అమ్మాయి తరపు బంధువులు అబ్బాయి ఇంటికి వెళ్లారు. వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉంది.
అక్కడ ఆ అబ్బాయి వాళ్ళ కుటుంబం లేదు. వారి కుటుంబానికి కట్నం కింద 25 లక్షల రూపాయలను 25 కిలోల బంగారాన్ని ఇచ్చారు. అదంతా తీసుకొని మాణిక్ రెడ్డి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియని మాణిక్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఊరు విడిచి వెళ్లిపోయారు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ పెళ్లి కొడుకుని, వారి కుటుంబాన్ని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయంపై ఆ యువతి మాట్లాడుతూ అతను ఒక అడ్వకేట్ అని, బార్ అసోసియేషన్ మెంబర్ అని, అతను అలా చేస్తాడు అని అనుకోలేదు అని చెప్పారు.