విశాఖలో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ప్రమాదం దృశ్యాలు చాలా హృదయవిదారకంగా ఉన్నాయి. చిన్నారుల గాయాలతో రక్తం కారుతూ రోడ్డుపై పడి ఉండటాన్ని చూసిన వారి కళ్లు చెమర్చకమానదు.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…విశాఖలోని బేతని స్కూల్ విద్యార్థులు ఈ ఉదయం ఆటోలో స్కూల్ కి వెళ్తున్నారు. సంఘం శరత్ థియేటర్ సమీపంలోకి వచ్చేసరికి స్కూల్ పిల్లలు ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. అంతే అటో పల్టీలు కొట్టింది.
దెబ్బకు అటోలో ఉన్న విద్యార్థులు రోడ్డుపై చెల్ల చెదురుగా పడిపోయారు. ఆటో నుజ్జు నుజ్జు అయిపోయింది. ఆ ప్రమాదాన్ని చూసిన వారంతా ఘోరం జరిగిపోయిందని అనుకున్నారు. మెరుపు వేగంతో స్పందించిన స్థానికులు ఆటోను పైకి లేపి పిల్లలకు సపర్యలు చేశారు.పిల్లలు షాక్ కి గురై బోరున ఏడుస్తూ రక్తం కారుతున్న గాయాలతో రోడ్డుపై పడి ఉండటం చూసిన వారికి ప్రాణం తరుక్కుపోయింది. అటు నుంచి వెళ్తున్న ప్రతి ఒక్కరు ఎవరికి తోచిన విధంగా వారు పిల్లలకు సాయం చేశారు. ఈ ప్రమాదంలో 8 మంది స్కూల్ పిల్లలు గాయపడ్డారు.
గాయపడ్డ పిల్లలను స్థానికంగా ఉండే సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఆటోను ఢీ కొట్టిన తర్వాత లారీ డ్రైవర్, క్లీనర్ పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని స్థానికులు, ఆటో డ్రైవర్లు కలిసి పట్టుకొని బంధించారు. పోలీసులు వచ్చే వరకు అక్కడే ఉంచి వారికి అప్పగించారు. ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పరుగుపరుగున కొందరు ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
Also Read:లోకల్ బాయ్ నాని దోషి కాదా..? నానికి జనసేన పార్టీకి సంబంధం ఉందా..?