ప్రజల మనసులో చెరగని ముద్రవేసిన, సమాజం మొత్తానికీ ప్రాతినిధ్యం వహించిన మహాత్మా గాంధీని ఓ వర్గానికి ప్రతినిధిగా చూపించేందుకు నేడు చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఆనాడు కూడా ఇలాంటి ప్రయత్నాలకు తక్కువేమీ లేదు.
అలాగే అంబేడ్కర్ అణగారిన వర్గాల ఉన్నతి కోసం ఎంతో శ్రమించారు. అంటరానివారికి రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలనీ, పౌరహక్కులు ఉండాలనీ కోరుతూ విన్నపం చేయడం ద్వారా రాజకీయాలలో అడుగుపెట్టారు. అందరికి సమానంగా ఓటు హక్కు ఉండాలని నిర్ద్వంద్వంగా వాదించారు. ఆ వాదనకే చివరివరకూ కట్టుబడి ఉన్నారు.
అయితే ఈ ఇద్దరి మహా మహులకు అనేక విషయాల పై వాదనలు, చర్చలు జరుగుతూ ఉండేవి. వాటికీ సంబంధించిన ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అయితే గాంధీజీ, అంబేద్కర్ కి మధ్య 1932 కాలం లో జరిగిన ఒక చర్చ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అంబేద్కర్: దేశంలో రెండు భిన్నమైన సిద్ధాంతాలకు చెందిన రెండు గ్రూపులు ఉన్నాయన్న విషయాన్నీ మనం అంగీకరించి, దానికి తగ్గట్లు ప్రవర్తించాలి. మాకు ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కల్పించారు. మాకు ఎంతో సహాయం చేస్తున్నారు. కానీ మాకు రెండు ఓట్లు వేసే హక్కు ఇవ్వాలి. అప్పుడు దేశంలోని దళితులు ఒక ఓటు ద్వారా తమ ప్రతినిధిని ఎన్నుకోవడం.. రెండో ఓటుతో సాధారణ తరగతి ప్రతినిధిని ఎన్నుకొనే అవకాశం ఉంటుంది.
అలాగే మీరు పూర్తిగా అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితమైతేనే మీరు మాకు హీరో అవుతారు. అలాగే మాకు అధికారం రావడం తప్పనిసరి. కానీ మీరు మా వర్గం లో పుట్టకుండా మా ఇబ్బందులు ఎలా తీరుస్తారు..??
గాంధీజీ: మీరు మీ అభిప్రాయాన్ని చక్కగా స్పష్టం చేసారు. భంగీల గురించి మాట్లాడేందుకు భంగీగానే పుట్టాలన్నదే తప్పనిసరైతే.. వచ్చే జన్మలో భంగీ ఇంట్లో పుట్టాలని కోరుకుంటాను. కానీ ఒకసారి మీకు అధికారం వచ్చాక.. మీ సంఘం లోని మిగతా వారికీ ఎదిగే అవకాశం ఇస్తారా..?? అన్నది నా ప్రశ్న. నేను అణగారిన వర్గాల వారికీ ప్రయోజనం చేకూర్చాలని భావిస్తున్నాను. వారికి సేవ చేయాలి అనుకుంటున్నాను. సమాజాన్ని రెండు వర్గాలుగా విభజించడం నాకు మొదటి నుంచి ఇష్టం లేదు. అంటరానివారంతా ఒక్కటైతే సనాతనవాదుల కోటను డైనమైట్‌తో నేలమట్టం చేస్తారు అని నేను నమ్ముతాను.
మీరు నమ్ముతారో లేదో.. నేను 12 ఏళ్ల వయసులో ప్రజాస్వామ్యం పాఠం నేర్చుకున్నాను. ఇంటి స్వీపర్‌ను అంటరానివాడిగా పరిగణించినందుకు మా అమ్మతో గొడవ పడ్డాను. ఆ రోజు భగవంతుడిని భంగి రూపంలో చూశాను. నేను భారతదేశానికి వచ్చిన మొదటి రాజకీయ ప్రసంగంలో భాంగీని కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా చేయాలని భావించాను. నేనూ అంటరాని వాణ్నే. అందరినీ ఏకతాటిపై కలుపుకుంటూ వెళ్లడమే నా లక్ష్యం. మిమ్మల్ని సమాజం అంటరానివారిగా పరిగణిస్తోంది. నా విషయానికి వస్తే.. అంటరాని వాడిగా బతకాలని నాకు నేనుగా నిర్ణయించుకున్నాను.
నా చితాభస్మం గాలిలో కలిసిపోయిన తర్వాత లేదా అలా జరగకపోతే గంగలో నిమజ్జనం చేసిన తర్వాత ప్రజాస్వామ్యవాదుల్లో నేనే అగ్రగణ్యుడిని అని అందరు అంగీకరిస్తారు. నేను చనిపోయిన తర్వాత నా కొడుకు తప్పకుండా నా ఆదర్శాలను అనుసరిస్తారు అన్న నమ్మకం నాకు ఉంది. అలాగే నా సహకారం మీకు ఉంటుంది అని నమ్మినపుడే ముందుకు వెళ్ళండి.
ఇలా గాంధీజీ కి, అంబేద్కర్ కి ఎన్నో అంశాల పైన విభిన్న దృక్పథాలు ఉండేవి. కానీ వీరిరువురు కలిసి దేశ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను రూపాన్నిచ్చారు. అలాగే దేవాలయాల్లోకి హరిజనుల ప్రవేశంపై గాంధీజీ నేరుగానే ప్రశ్నలు సంధించారు. ఇలాంటి చర్యలతో హిందుత్వం భావన ధ్వంసమవుతుందని వాదించారు. బుద్ధుడి తర్వాత సామాజిక-మత దురాచారాలపై ఎవరైనా గట్టి, లోతైన ప్రభావం చూపారా అంటే.. వెంటనే గాంధీజీ పేరే చెప్పాలి.