మామూలుగా కప్పు కాఫీ ఖరీదెంతుంటుంది..? మహా అయితే రూ.20 లేదంటే రూ.50ల వరకు ఉంటుంది. కొంచెం పెద్ద హోటల్స్ అయితే రకరకాల పేర్లు చెప్పి ఒక 150 రూపాయలు అలా కూడా వసూలు చేస్తాయి. అయితే తాజాగా జరిగిన ఓ ఘటనలో రెండు కాఫీలకు 3 లక్షలకు పైగా బిల్ వేసింది ఓ రెస్టారెంట్. ప్రపంచం లోనే అతిపెద్ద కాఫీ చైన్ రెస్టారెంట్ స్టార్ బక్స్. దీని గురించి తెలియని వారు ఉండరు. ఈ కంపెనీ కి 80 దేశాల్లో సుమారు 34 వేల స్టోర్స్ ఉన్నాయి.
అమెరికాకు చెంది జెస్సీ, డీడీ ఒడెల్ కాఫీలు తాగేందుకు స్టార్ బక్స్ కు వెళ్లారు. రెండు కాఫీ ఆర్డర్ చేసి, కాస్త స్నాక్స్ తిని బిల్ పే చేసి కార్డు ద్వారా డబ్బులు చెల్లించి వచ్చేశారు. వాళ్ళు తరచూ అక్కడికి వెళ్లి కాఫీ తాగుతూ ఉండేవారు అందుకే బిల్ ఎంత అయ్యింది అనేది అప్పుడు చూసుకోలేదు. తర్వాత కొన్ని రోజులకి జెస్సీ, డీడీ ఒడెల్ పిల్లల్తో షాపింగ్ కి వెళ్లారు. అప్పుడు బిల్లు చెల్లించేందుకు కార్డును ఇవ్వగా తగినంత నగదు లేదని చూపిస్తోంది. మళ్లీ మళ్లీ ప్రయత్నించగా.. అలానే చూపిస్తుండటంతో వారు ఆ కార్డు లావాదేవీలను చెక్ చేసారు.
అయితే స్టార్బక్స్ నుండి 4,444.44 డాలర్లు వసూలు చేసినట్లు గుర్తించారు. అంటే మన కరెన్సీలో 3,66,915 రూపాయలు. తాము గత 16 సంవత్సరాల నుండి కాఫీ తాగుతున్నామని, అయితే కేవలం 9 నుండి 10 డాలర్లు మాత్రమే అయ్యేదని జెస్సీ చెప్పారు. ఈ సమస్యను మేనేజర్ దృష్టికి తీసుకెళ్లగా.. తర్వాత సాంకేతక లోపం కారణంగా సమస్య తలెత్తిందని గ్రహించిన స్టార్బక్స్ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఆ జంటకు ఆ డబ్బు మొత్తాన్ని రెండు చెక్కుల రూపంలో అందజేసిందని సమాచారం. అయితే ఆ చెక్ లు బౌన్స్ కావడం తో ఆ జంట పోలీస్ కేసు ఫైల్ చేస్తినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన కారణంగా తమ కుటుంబం ‘థాయిలాండ్’ ట్రిప్ కి వెళ్లడం కుదరలేదని ఆ జంట పేర్కొన్నారు. ఆ ట్రిప్ కి సంబంధించిన టికెట్స్ రుసుముని కూడా తాము నష్టపోయామని వారు వెల్లడించారు. రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు బిల్లును పూర్తిగా చెక్ చేసుకోవాలని తమ కి ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా ఈ జంట పంచుకుంది.