Ads
దసరా.. హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైన పెద్ద పండుగల్లో ఒకటి. దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన రోజును మనం దసరా పండుగ గా జరుపుకుంటాం. శ్రీ రాముడు తొమ్మిది రోజులు దుర్గను పూజించి.. ఆ తరువాత రావణుడిపై యుద్ధం లో గెలిచాడని చెబుతుంటారు. అందుకే చెడు పై మంచి చేసే యుద్ధానికి ప్రతీకగా దసరా పండుగను వేడుక లా చేసుకుంటారు.
Video Advertisement
భారత దేశమంతా తొమ్మిది రోజుల పాటు.. తొమ్మిది అవతారాలలో దుర్గాదేవిని పూజిస్తారు. చివరి రోజైన దశమిని “విజయ దశమి” గా జరుపుకుంటారు. ఆ రోజే పాండవులు కూడా తమ ఆయుధాలను శమీ చెట్టు పైనుంచి దింపి పూజ చేసుకుని యుద్ధం చేసారని.. వారు కూడా విజయం సాధించారని చెబుతుంటారు. అందుకే విజయ దశమి రోజున ఎవరి ఆయుధాలను వారు పూజించుకుని ఏ కార్యం తలపెట్టినా విజయం సాధిస్తారని చెబుతారు.
పురాణం లో చెప్పబడ్డ మహిషాసుర వధ కథను తెలుసుకుందాం. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు మానవులను, ఋషులను, దేవతలను సైతం హింసించేవాడట. మహిషం అంటే దున్నపోతు అని అర్ధం. ఈ రాక్షసుడి తల కూడా దున్నపోతు తలలా ఉండేదట. అతన్ని సంహరించడం కోసమే.. దేవతలంతా కలిసి దుర్గాదేవిని సృష్టించారట. అయితే.. ఆమె అందాన్ని చూసి మహిషాసురుడు మోహిస్తాడట. తనను పెళ్లి చేసుకోవాలని కోరతాడట.
అందుకు ఆ అంబ కొన్ని షరతులు పెడుతుంది. తనతో యుద్ధం చేసి గెలవాలని కోరుతుంది. గెలిస్తే.. పెళ్లాడతానని మాటిస్తుంది. అలా మొదలైన యుద్ధం తొమ్మిదిరోజుల పాటు సాగుతుంది. తొమ్మిదవరోజున, అమ్మ మహిషాసురుడిని అంతం చేస్తుంది. అతని తలని నరికేస్తుంది. ఆరోజు ప్రజలంతా పండగ చేసుకుంటారు. అందుకే నేటికీ.. కొన్ని ప్రాంతాలలో దున్నపోతు తలను నరికి అమ్మకు బలిస్తుంటారు. ఈ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలలో దుర్గాన్ని కొలిచి.. ఆమెను ప్రసన్నం చేస్తారు.
మరో కథ కూడా ప్రచారం లో ఉంది. అమ్మ వారు పరమేశ్వరుడి దగ్గర ఓ వరం పొందుతుంది. అదేంటంటే..ప్రతి ఏటా తొమ్మిది రోజుల పాటు ఆమె తన తల్లి అయిన భూమి వద్ద ఉండడానికి శివుడు ఆమెకు వరమిస్తాడు. అందుకే ప్రతి ఏడాది ఆమె వచ్చే తొమ్మిది రోజులను మనం నవరాత్రులుగా జరుపుకుని ఆమెను సంతుష్టపరుస్తాం. దసరా రోజున, చాలా ప్రాంతాల్లో ఆయుధ పూజలు చేస్తారు. తమ కార్యాలు విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకుంటారు.
End of Article